కౌలు రైతులకు సాయం చేయలేం

1 Sep, 2017 04:28 IST|Sakshi
కౌలు రైతులకు సాయం చేయలేం

రాజకీయాలకతీతంగారైతు సమన్వయ సమితులు
వ్యవసాయశాఖ మంత్రి పోచారం స్పష్టీకరణ


సాక్షి, హైదరాబాద్‌: కౌలు రైతులకు పెట్టుబడి కింద ఆర్థిక సాయం చేయడం న్యాయపరంగా సాధ్యంకాదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గురువారం ఇక్కడ ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, నిర్వహణపై డివిజన్, మండల వ్యవసాయ అధికారుల శిక్షణ’ కార్యక్రమంలోనూ, తర్వాత విలేకరులతోనూ మంత్రి పోచారం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉండగా, కలెక్టర్ల సమావేశం వల్ల రాలేకపోయారు.

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మంచి రోజులు వచ్చాయని, రైతులు ఆర్థికంగా బలోపేతమవుతూ బ్యాంకులను శాసించే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. 1936 తర్వాత రాష్ట్రంలో భూసర్వే జరగలేదని చెప్పారు. ప్రతీ రైతుకు ఎకరాకు 4 వేల రూపాయల చొప్పున పెట్టుబడి రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న నేపథ్యంలో భూ సర్వే చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రతీ గ్రామంలో 15 మంది సభ్యులతో రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేస్తారని, అందులో ఒకరు సమన్వయకర్తగా ఉంటారని వివరించారు. ప్రతీ సంఘంలో మూడో వంతు మహిళలు ఉంటారని తెలిపారు. మండల, జిల్లా సమన్వయ సమితుల్లోనూ 24 మంది సభ్యులుగా ఉంటారని, వీటిల్లోనూ మూడో వంతు మహిళలు ఉంటారని వివరించారు. రైతు సమితుల సమన్వయకర్తలకు గౌరవ వేతనం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1,24,06,474 పట్టాదారులు చెరువులు, కుంటలపై ఆధారపడి ఉన్నారన్నారు.

ఈ నెల 9వ తేదీలోపు సమితుల ఏర్పాటు, ఈ నెల 10–14 తేదీల మధ్యలో మండల సదస్సులు, 15 నుండి డిసెంబర్‌ 15 వరకు భూముల రికార్డుల ప్రక్షాళన ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 10,733 రెవెన్యూ గ్రామాలకుగాను ప్రతి 9 గ్రామాలకు ఒక బృందం చొప్పున 1,193 బృందాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ బృందం ప్రతీ గ్రామంలో 10 రోజులుండి భూములను పూర్తిగా సర్వే చేస్తుందన్నారు. ఈ టీం భూమి కొలతల వివరాల పట్టిక, రైతులవారీగా భూముల వివరాలను సేకరిస్తుందని తెలిపారు. అనంతరం పాస్‌ పుస్తకాలను రూపొందించి రైతులకు అందజేస్తామన్నారు. రికార్డులను క్రమబద్ధీకరించడానికి ప్రతీ తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ను ప్రారంభి స్తామనీ, ప్రతీ తహసీల్దార్‌ రిజిస్ట్రార్‌గానూ ఉంటారనీ అన్నారు. మరో 526 ఏఈవో పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి తీసుకున్నామని చెప్పారు.

రైతు అవార్డు సీఎం తీసుకుంటారో లేదో..!
ముఖ్యమంత్రికి రైతు అవార్డు బోగస్‌ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరుపారేసుకోవడంపై మంత్రి పోచారం మండిపడ్డారు. అవార్డు కోసం తాము ఎవరినీ బతిమిలాడుకోలేదని అన్నారు. మూడేళ్లలో తాము రైతులకు చేసిన సేవలకు గుర్తింపుగా సంబంధిత సంస్థే ప్రకటించిందని చెప్పారు. రైతు అవార్డును ముఖ్యమంత్రి తీసుకుంటారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్‌ డాక్టర్‌ జగన్‌మోహన్, ఉద్యాన శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు