అంతా కరువే

1 Nov, 2014 02:26 IST|Sakshi
అంతా కరువే

జిల్లా రైతాంగాన్ని ఖరీఫ్ ముంచేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాత కుదేలయ్యాడు. ఎక్కడ చూసినా కరువుఛాయలే కన్పిస్తున్నాయి.  భూగర్భజలాలు సైతం అడుగంటడంతో తాగునీటికీ కష్టకాలమొచ్చింది. అడపాదడపా కురిసిన వర్షాలు పంటలను గట్టెక్కించలేకపోయాయి. సీజన్ మొత్తంలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 781 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సిఉండగా.. సీజన్ చివరినాటికి కేవలం 554.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో సాధారణం కంటే 29శాతం లోటు నమోదైంది. ఈ నేపథ్యంలో యంత్రాంగం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలంటూ నివేదికలు రూపొందించింది. ఈ నివేదికల్ని గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. జిల్లాలోని 37 మండలాలనూ కరువు పీడిత ప్రాంతాలుగా అందులో ప్రస్తావించింది.  - సాక్షి, రంగారెడ్డి జిల్లా
 
* 29 శాతం లోటు వర్షపాతం, పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం
* కరువు నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన జిల్లా యంత్రాంగం
* ఖరీఫ్‌లో మిగిలింది అప్పులే..
 సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 37 మండలాలున్నాయి. ఇందులో నాలుగు మండలాలు పూర్తిగా పట్టణ ప్రాంతాలు కాగా.. మిగతా 33 గ్రామీణ మండలాలు. తాజాగా జిల్లా యంత్రాంగం రూపొందించిన కరువు నివేదికల్లో అన్ని మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా పేర్కొంది. పట్టణ మండలాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. దీంతో కరువు మండలాలుగా గుర్తించారు. 33 గ్రామీణ మండలాల్లో 27 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. సీజన్ చివరలో అధిక వర్షాలు కురిసి వర్షపాతం నమోదైనప్పటికీ.. వాటి మధ్య అంతరం హెచ్చుగా ఉందని అధికారులు తేల్చారు.

ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 1.84లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను సీజన్ ముగిసే నాటికి 1.62లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా వేలాది హెక్టార్లలో విత్తనాలు మొలకెత్తలేదు. కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులను పంట తట్టుకున్నప్పటికీ దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ క్రమంలో సీజన్ ముగిసిన అనంతరం చేసిన సర్వేలో పంటల దిగుబడి భారీగా తగ్గినట్లు అధికారులు తేల్చారు. మొత్తంగా అన్నివిధాలా నష్టం జరగడంతో జిల్లాలోని 37 మండలాలను కరువు మండలాలుగా పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు.
 
నాలుగు అంశాలే ప్రామాణికం..
కరువు నివేదికలపై యంత్రాంగం నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుని నిర్ధారించింది. వర్షపాతం, వర్షాల మధ్య అంతరం, సాగు విస్తీర్ణం, దిగుబడి అంశాల ఆధారంగా కరువును ఖరారు చేసింది. జిల్లాలో కొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ.. వర్షాల మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా సాగు విస్తీర్ణం, దిగుమతుల అంశాల్లోనూ ఆశాజనక పరిస్థితులు లేక పోవడంతో ఆమేరకు అన్ని మండలాలు కరువు నివేదికల్లోకి ఎక్కాయి.
 
లబ్ధి ఇలా..
జిల్లా యంత్రాంగం సమర్పించిన నివేదికల్ని ప్రభుత్వం ఆమోదిస్తే రైతులకు పెట్టుబడి రాయితీ అందుతుంది. అదేవిధంగా పంటరుణాలు రీషెడ్యూల్ చేసే వెసులుబాటు వస్తుంది. అదేవి దంగా తాగునీటి సరఫరా మొరుగుపర్చేందుకు ప్రత్యేక నిధులు అందుతా యి. ఇవేకాకుండా కరువు ప్రభావంతో కలిగిన నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

మరిన్ని వార్తలు