న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యం

7 May, 2018 06:53 IST|Sakshi
న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన రైతులు

పరకాల రూరల్‌ : తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ పలువురు రైతులు ఆదివారం పురుగు మందు డబ్బాలతో మండలంలోని సీతారాంపురం పరకాల–కంఠాత్మకూర్‌ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు మేల్‌ ఫిమేల్‌ వరి రకాన్ని 60 ఎకరాల్లో సాగు చేశారు. పంట పూర్తయిన అనంతరం 25 మందికి చెందిన 28 ఎకరాల వరి పంటను హార్వెస్టింగ్‌ చేసి మిగిలిన 32 ఎకరాల పంట విషయంలో రేపు, మాపు అంటూ కంపెనీ ఆర్గనైజర్‌ కాలం గడిపాడు.

ఈ క్రమంలో ఈనెల మూడో తేదీన కురిసిన అకాల వర్షంతో 32 ఎకరాల్లో ధాన్యం గింజలు పూర్తిగా రాలిపోయాయి.ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను అడగితే పట్టించుకోవడంలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్‌ ఆర్గనైజర్‌ రఘుపతి తమ మిషన్‌తోనే హార్వెస్టింగ్‌ చేసుకోవాలని షరతు పెట్టడంతోపాటు కోతకు వచ్చిన తమ పంటలను వదిలి అధిక రేట్లతో ఇతర గ్రామాల్లో హార్వెస్టింగ్‌ చేశాడని, దీంతో తాము నష్టపోయామని వాపోయారు.

మరిన్ని వార్తలు