మా భూములు మీకివ్వం

28 Jun, 2019 11:12 IST|Sakshi
పెట్రోల్‌ బాటిళ్లతో నిరసన తెలుపుతున్న రైతులు

‘పాలమూరు – రంగారెడ్డి’ సర్వే పనులను  అడ్డుకున్న కుడికిళ్ల రైతులు  

సాక్షి, కొల్లాపూర్‌: మండలంలోని కుడికిళ్ల భూముల్లో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబందించిన సర్వే చేయడానికి వచ్చిన తహసిల్దార్‌ వీరభద్రప్ప బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. గురువారం పోలీస్‌ బందోబస్తుతో రైతుల పొలాలను సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులతోపాటు ఇరిగేషన్‌ అధికారులు వచ్చారు. కుడికిళ్ల రైతులు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని నాలుగేళ్లుగా అడ్డుకుంటున్నారు.

తాజాగా గురువారం వచ్చిన అధికారులను పంపించేశారు. కుడికిళ్ల గ్రామానికి చెందిన రైతుల పొలాలు 242 ఎకరాలు పాలమూరు ప్రాజెక్టు కింద పోతున్నాయి. గతంలో కల్వకుర్తి ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులలో భూములు కోల్పోయారు. ప్రస్తుతం పాలమూరు ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని సంవత్సరాల కొద్దీ పోరాటాలు చేస్తున్నారు. 

భూమికి భూమి ఇవ్వాలి..  
2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇస్తే తప్పా భూములు ఇవ్వమని తెగేసి చెప్పారు. ఒకటి, రెండు ఎకరాల చొప్పున భూములు మిగిలాయని అవి కూడా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో పోతే బతికేదెట్లా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసేదేమి లేక ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వెనుదిరిగారు. కార్యక్రమంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న మహిళారైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

పోలీసు బందోబస్తుతో..
కుడికిళ్ల రైతులపై ఒత్తిడి పెంచేందుకు అధికారులు భారీ పోలీస్‌ బందోబస్తుతో వచ్చారు. సర్వేకు వచ్చిన అధికారులను దాదాపుగా 200మంది రైతులు అడ్డుకున్నారు. భూములలోకి అడుగు పెట్టనివ్వబోమని తేల్చి చెప్పారు. భారీ పోలీస్‌ బందోబస్తుతో వచ్చారు. అధికారులతో దాదాపుగా 2గంటల వాగ్వివాదం చోటుచేసుకుంది. మహిళా రైతులు పెట్రోలు బాటిళ్లు పట్టుకుకుని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే చేస్తే పెట్రోలు పోసుకుని అంటించుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్, ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మాతో చర్చలు జరపాలని అధికారులతో చెప్పారు.     

మరిన్ని వార్తలు