గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు

13 Feb, 2019 04:00 IST|Sakshi
ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి చౌరస్తాలో 63వ నంబర్‌ జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు

జాతీయ రహదారిపై బైఠాయింపు 

పసుపు, ఎర్రజొన్నలను ప్రభుత్వమే 

కొనుగోలు చేయాలని డిమాండ్‌

ఆర్మూర్‌: పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రాంత రైతులు మంగళవారం రోడ్డెక్కారు. సుమారు నాలుగు గంటల పాటు జాతీయ రహదారిపైనే బైఠాయించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిషేధాజ్ఞలు విధించినప్పటికీ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది రైతులు తరలివచ్చి ఆర్మూర్‌ మండలం మా మిడిపల్లి చౌరస్తాలోని 63వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఎర్రజొన్న క్వింటాలుకు రూ.3,500, పసుపు క్వింటాలుకు రూ.15 వేలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ముందస్తు అరెస్టులు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలని, తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. ఈ నెల 16న బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని ముప్కాల్, వేల్పూర్‌ మండల కేంద్రాల్లో, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి లో, ఆర్మూర్‌ నియోజకవర్గం పరిధిలోని మామిడిపల్లిలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, రైతులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వాహనాలను వేరే మార్గం నుంచి తరలించారు.

మరిన్ని వార్తలు