రోడ్డెక్కిన అన్నదాతలు

28 May, 2018 12:33 IST|Sakshi
రోడ్డుపై బైఠాయించిన రైతులు

సారంగపూర్‌(నిర్మల్‌) : ధాన్యం తూకంలో కోత విధించొద్దని డిమాండ్‌ చేస్తూ మండలంలోని మలక్‌చించోలి గ్రామ రైతులు ఆదివారం రోడ్డెక్కారు. నిర్మల్‌–స్వర్ణ ప్రధాన రహదారిపై ఎక్స్‌రోడ్డు వద్ద గంటపాటు రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై సునీల్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమి రా అన్నారు. అనంతరం కౌట్ల(బి) పీఏసీఎస్‌ చైర్మన్‌ అయిర నారాయణరెడ్డి, ఏఎంసీ అధ్యక్షుడు రాజ్‌మహ్మద్, అడెల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వద్దకు చేరుకున్నారు.

రైతుల సమస్య పరిష్కరించడంతో వారు ఆందోళన విరమించారు. వారు మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ముందే ధాన్యం కేంద్రాలకు తరలించినా కొనుగోళ్ల విషయంలో నిర్వాహకులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తడవకున్నా తడిసిందంటూ తూకంలో కోతలు విధించడం సబబు కాదన్నారు. గతంలోనే చాలాసార్లు కొనుగోళ్లు వేగిరం చేయాలని పదేపదే వేడుకున్నా నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వా పోయారు. ధాన్యం తడవడానికి కారణం కేంద్రాల్లోని నిర్వాహకుల నిర్లక్ష్యమేనన్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కోతలు విధించకుండా కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు