గుండె పగిలింది..

10 Nov, 2014 03:02 IST|Sakshi

 సాక్షి నెట్‌వర్క్: ఆరుగాలం కష్టపడి అందరి కడుపూ నింపే అన్నదాతను కరువు కబళిస్తోంది.. వానల్లేవు.. కరెంటు రాదు.. విత్తనాలు, ఎరువులు అందవు.. బ్యాంకులు రుణాలివ్వవు.. వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పు చేయాల్సిన దుస్థితి.. ఎలాగోలా పెట్టుబడి సమకూర్చుకున్నా వేసిన విత్తనాలు మొలకెత్తక, మొలకెత్తినా పంట చేతికి వచ్చే పరిస్థితి లేక రైతులు ఆవేదనలో మునిగిపోతున్నారు.. చేతికొచ్చే పంట కళ్లముందే ఎండిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు.. చేసిన అప్పులెలా తీర్చాలనే ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.. ఇప్పటివరకు 369 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే సగటున రోజుకు నలుగురు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరుగనున్న నేపథ్యంలో... ఆదుకునే నిర్ణయాలు వెలువడుతాయని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం 40 లక్షల హెక్టార్లుకాగా.. ఈ ఏడాది 2 లక్షల హెక్టార్ల సాగు తగ్గింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 10.04 లక్షల హెక్టార్లుకాగా.. ఈ ఏడాది 8.17 లక్షల హెక్టార్లలోనే సాగు చేశారు. తెలంగాణలో పత్తి పంట పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గత రెండేళ్లుగా 18 లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేయగా.. ఈ ఏడాది 16 లక్షల హెక్టార్లకు తగ్గింది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనైతే వేల ఎకరాల్లో వరిని తగులబెట్టారు. బావుల కింద వేసిన పంటలు విద్యుత్ లేక ఎండిపోయాయి. దీంతో ఆందోళనకు గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
 
 అప్పులు, ఆర్థిక ఇబ్బందులే..
 
 ఈ ఖరీఫ్‌లో తొలి వర్షాలకే పంటలు వేసిన రైతులు  విత్తనాలు మొలకెత్తకపోవడంతో.. పెట్టుబడితో పాటు విత్తనాల ఖర్చునూ నష్టపోయారు. రుణమాఫీ పథకం ఆలస్యం కావటంతో బ్యాంకుల నుంచి కొత్త రుణా లు అందడం లేదు. దీంతో చాలా మంది రైతులు నాలుగైదు రూపాయల వడ్డీకి ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి పంటలు వేశారు. సాగుకు పెట్టుబడి పెరగడం.. కూలీ రేట్లు పెరిగిపోవడం.. ఇందుకు అనుగుణంగా పంట దిగుబడులు లేకపోవడం, మార్కెట్‌లో గిట్టుబాటు ధర రాకపోవడం వంటివి రైతన్నను కుంగదీశాయి.
 
 వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లతో..
 
 రాష్ట్రంలోని రైతులు రూ. 18 వేల కోట్ల వరకూ ప్రైవేటు అప్పులు చేసినట్లు ఒక అంచనా. కానీ ఇలా అప్పు చేసి పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవాలంటే కనీస మద్దతు ధర అందడం లేదు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,050 కాగా.. రూ.3,300 మించి కొనే వారు లేరు. మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ. 1,510 ఉండగా.. రూ. 1,050కు మించి ఇవ్వడం లేదు. వరి కనీస మద్దతు ధర రూ. 1,340 ఉండగా.. రూ. 1,100 కంటే ఎక్కువ అందడం లేదు. దీనికితోడు వడ్డీ వ్యాపారులు తమ అప్పులు వెంటనే తీర్చాలని అందరి ముందు నిలదీస్తుండడంతో... అది భరించలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా చనిపోయిన వారిలో ఎక్కువ మంది 30-35 ఏళ్ల యువ రైతులేనని ఒక రైతు సంఘం లెక్కగట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జారీ చేసిన 421జీవో ప్రకారం.. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ. లక్షన్నర పరిహారం అందించి ఆదుకోవాలి. కానీ పెద్దదిక్కును కోల్పోయి కుమిలిపోతున్న రైతు కుటుంబాలకు పరిహారం అందడం లేదు.
 

మరిన్ని వార్తలు