రైతులకు అందేనా నీరు?

18 Nov, 2018 16:55 IST|Sakshi

మరమ్మతులు లేక పలు లిఫ్టులు నిరుపయోగం

రైతుల భాగస్వామ్యం చిక్కుతో తొలగని భారం  

ఖమ్మంఅర్బన్‌:  రైతుల పంట పొలాలకు సాగు నీరందించేందుకు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు(లిఫ్టులు) చాలాచోట్ల నిరుపయోగంగా మారాయి. ఆయకట్టులో పంటలు పండించాలనుకున్న రైతుల ఆశలు ఆవిరై.. జలాలందక ఎండిన పైర్లతో వీరి తలరాతలు మారని దైన్యం నెలకొంది. జిల్లాలో సాగర్‌ కాల్వ నీరే ఆధారం. ఈ కాల్వలపై, అడపా దడపా పారే ఏర్లపై పలుచోట్ల నిర్మించిన ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లావ్యాప్తంగా 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనేది లక్ష్యం. పైపులు, విద్యుత్‌ మోటార్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ లిఫ్టులు మూలనపడ్డాయి. రైతుల భాగస్వామ్యంతోనే మరమ్మతులు చేయించుకోవాల్సి ఉండడంతో..పట్టించుకునేవారు కరువయ్యారు.

 పంటల పెట్టుబడి, నష్టాలతోనే సాగుదారులు అవస్థ పడుతున్న క్రమంలో ఈ మరమ్మతుల వ్యయం వీరికి పెనుభారంగా మారుతోంది. చివరి భూములకు నీరందడం లేదని ఆ రైతులు విముఖత చూపుతుండడంతో మరింత నిర్లక్ష్యం నెలకొంటోంది. ఖమ్మం జిల్లాలో 135 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. 35 లిఫ్టులు పాక్షికంగా పని చేస్తుండగా.. 10,991 ఎకరాలకు నీరందుతోంది. మరో 49 ఎత్తిపోతల పథకాలు అసలు పనిచేయట్లేదు. ఇవి వ్యవసాయ భూములకు చుక్కనీరు అందించలేకపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 51 లిఫ్టుల ద్వారా 30,247 ఎకరాలకు మాత్రమే పుష్కలంగా నీరందుతోంది.
  
మూడు కొత్త పథకాలకు రూ.29కోట్లు 
జిల్లాలో మూడు కొత్త లిఫ్టు ఇరిగేషన్‌ పథకాల నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం రూ.29.41కోట్లు మంజూరు చేసింది. కల్లూరు మండలం కొర్లకుంట, మధిర మండలం మాధవీపురం, బోనకల్‌ మండలం రాపల్లెలో వీటిని నిర్మించనున్నారు. వీటి ద్వారా నాలుగు వేల ఎకరాలకు సాగునీరందించాలనేది లక్ష్యం.
  
మరమ్మతుల నిధులు ఇలా.. 
జిల్లాలో మూడు ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు గతంలో రూ.4.12కోట్లు మంజూరయ్యాయి. రఘునాథపాలెం మండలం జాన్‌బాద్‌తండా లిఫ్టు, కూసుమంచి మండలం నరసింహులగూడెం, చింతకాని మండలం కొదుమూరు లిఫ్ట్‌కు అదనపు పైపులైన్ల కోసం కేటాయించారు. జిల్లాలో లిఫ్టుల రిపేర్ల కోసం రూ.2కోట్లతో గతంలోనే అంచనాలు పంపినట్లు సమాచారం. మోటార్ల మరమ్మతులు, పంపు సెట్లు, పైపులైన్ల పనులు చేసే అవకాశముంది. పాలేరు నియోజకవర్గంలోని కామంచికల్‌ లిఫ్టు నిర్మాణానికి రూ.12కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు వెళ్లాయి.  

రైతుల భాగస్వామ్యం ఉండాలి.. 
లిఫ్టు ఇరిగేషన్ల నిర్వహణలో రైతుల భాగస్వామ్యం ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. జిల్లాలో పనిచేయని ఎత్తిపోతల పథకాల మరమ్మతు కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలోనే ప్రతిపాదనలు పంపించాం. కొన్నింటికి నిధులు మంజూరయ్యాయి. కొన్ని కొత్త పథకాలు కూడా వచ్చాయి. ఇంకా.. కొన్నింటి ప్రక్రియ నడుస్తోంది. రైతులంతా కలిసికట్టుగా ఉంటే.. సాగునీటి కష్టాలు తొలగుతాయి.  – విద్యాసాగర్, ఐడీసీ ఈఈ  

మరిన్ని వార్తలు