సహకార పునర్విభజన ఎప్పుడో?

26 Jan, 2018 20:18 IST|Sakshi

అందుబాటులో లేని సొసైటీలు

బుగ్గారం మండలంలో ఒక్కటీ లేదు...

ఇక్కట్లపాలవుతున్న రైతులు

గ్రామాలకు అనుకూలంగా సంఘాలను విభజించాలని డిమాండ్‌..

రైతన్నకు వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) సేవలు విస్తృతం కావడంలేదు. ఆయా సంఘాల పరిధి ఎక్కువగా ఉండటం.. గ్రామాలకు దూరంగా సంఘాలు ఉండడంతో  అన్నదాత ఇబ్బందులు పడాల్సివస్తోంది. జిల్లాలో 18 మండలాలుండగా.. 51 సహకార సంఘాలున్నాయి. కొత్తగా ఏర్పడిన బుగ్గారం మండలంలో ఒక్క సహకార సంఘం లేదు. కొన్ని మండలాల్లో రెండు, మూడు గ్రామాలకు ఒక సహకార సంఘం ఉండగా.. మరికొన్ని మండలాల్లో 8 నుంచి 10 గ్రామాలకు ఒకటి ఉండటంతో దూరం భారంగా మారింది.  
 
కథలాపూర్‌(వేములవాడ) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పల్లెల్లోని రైతులకు పట్టుగొమ్మలాంటివి. పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. పంటలను కొనుగోలు చేస్తూ సేవలందిస్తున్నాయి. వీటి విస్తర్ణ గురించి  ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిస్థాయి సేవలందడంలేదని  అపవాదు ఉంది. 


51 సొసైటీలు.. 95 వేల మంది సభ్యులు  
జిల్లాలో 18 మండలాలకు ప్రస్తుతం 51 సొసైటీలున్నాయి. ఇందులో 95,386 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రైతులు ప్రతి పంట సీజన్‌లో రుణాలు రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు కొత్తగా రుణాలు తీసుకుంటారు. వీటికోసం దూరంలో ఉన్న సొసైటీలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన బుగ్గారం మండలంలో ఒక్క సహకార సంఘం లేదు. దీంతో ఆ మండల రైతులు ఇతర మండలంలోని సొసైటీకి వెళ్లాల్సిందే. జిల్లాలో కొన్ని సొసైటీల పరిధిలో తక్కువ గ్రామాలుండగా.. మరికొన్ని సొసైటీలకు ఎక్కువ గ్రామాలున్నాయి. గ్రామాలకు దూరంగా ఉన్న సొసైటీలకు వివిధ పనులకు రైతులు వెళ్లిరావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. రుణాలకోసం, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో రాజకీయ చైతన్యం, పలుకుబడి గల మండలాలు చిన్నవైనప్పటికీ రెండు నుంచి మూడు సొసైటీలు ఉన్నాయి. మిగతా మండలాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.  


విభజిస్తేనే ప్రయోజనం... 
వ్యవసాయంలో రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడే సహకార సంఘాల సేవలు అందుబాటులోకి రావాలంటే వాటిని విభజించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కొత్తగా 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఏఈవోలను నియమించింది. అదే తరహాలో రైతులకు అందుబాటులో ఉండేలా సొసైటీలను విభజించాలని రైతులు కోరుతున్నారు. ఒక్కో సొసైటీలో వేలాది మంది రైతులు సభ్యత్వం ఉండగా.. ఏ అవసరం వచ్చిన క్యూ కట్టాల్సి వస్తోంది. ప్రతి సీజన్‌ ఆరంభంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు బారులు తీరిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం సొసైటీల విభజనపై దృష్టి సారించాలని జిల్లాలోని  రైతులు  కోరుతున్నారు.  


 సొసైటీ లేక ఇబ్బంది..
మా ఊరిలో సహకార సంఘం లేదు. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూషణరావుపేట సొసైటీ పరిధిలో మా గ్రామం ఉంది. వివిధ అవసరాల కోసం అక్కడకు రైతులు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. సీజన్‌లో  పంట రుణాల కోసం పోతే ఒక్కరోజంతా వృథా అవుతుంది. మా ఊరికి సమీపంలో సొసైటీ ఏర్పాటు చేయాలి. –కారంగుల చంద్రయ్య, కలిగోట, కథలాపూర్‌ 


ఆదేశాలు వస్తే పునర్విభజన.. 
సొసైటీల పునర్విభజన అనేది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉంటుంది. జిల్లాలో బుగ్గారం మండలంలో ఒక్క  సహకార సంఘం లేదు. ఆ మండలంలో కొత్తగా సహకార సంఘం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారుచేశాం. మిగతా సొసైటీల పునర్విభజన అనేది ప్రభుత్వం నిర్ణయం బట్టి ఉంటుంది.  –రామానుజచార్యులు, జిల్లా సహకార అధికారి  

మరిన్ని వార్తలు