అలిగిన చినుకు.. పైరుకు వణుకు...

30 Jul, 2017 01:52 IST|Sakshi
అలిగిన చినుకు.. పైరుకు వణుకు...

వర్షాల మధ్య అంతరంతో లక్షలాది ఎకరాల్లో పంటలపై ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల 20 రోజులుగా జాడ లేని వాన
మొలక దశలోనే దెబ్బతింటున్న సోయాబీన్, మొక్కజొన్న
పత్తిని హడలెత్తిస్తున్న గులాబీ రంగు పురుగు
⇒  42 లక్షల ఎకరాల్లో పంటకు గండం
డ్రైస్పెల్‌ ఉంటే ఉధృతంగా విస్తరించే పురుగు
  సుమారు 50 మండలాల్లో డ్రైస్పెల్‌.. ఆందోళనలో రైతాంగం


సాక్షి, హైదరాబాద్‌
ఈసారి సాధారణానికి మించి వర్షపాతం నమోదైనా.. రాష్ట్రంలో రైతన్నకు మాత్రం కలవరం తప్పలేదు. వర్షాల మధ్య తీవ్ర అంతరం (డ్రైస్పెల్‌) రావడంతో పంటలు ఎండిపోయే దుస్థితి తలెత్తింది. అనేక చోట్ల పత్తి, సోయాబీన్‌లతో పాటు పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పత్తి పంటకు గులాబీరంగు కాయ తొలుచు పురుగుతో తీవ్ర ముప్పు ముంచుకొచ్చింది. లక్షలాది ఎకరాల్లో పత్తి సాగు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల గత 20 రోజులుగా వర్షాలు లేకపోవడమే దీనికి కారణం. ఈ పరిస్థితి మరో రెండు మూడు రోజులు ఉండవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మరో వారం పాటు వర్షాలు కురవకపోతే పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని వ్యవసాయశాఖ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

చాలా మండలాల్లో వాన కరువు
రాష్ట్రంలో మొత్తం 584 మండలాలు ఉండగా.. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ వరకు (56 రోజుల్లో) 257 మండలాల్లో సాధారణ వర్షపాతం, 144 మండలాల్లో లోటు వర్షపాతం నమోదయ్యాయి. 183 మండలాల్లో మాత్రం సాధారణానికి మించి అధిక వర్షపాతం నమోదైంది. అయితే వాతావరణశాఖ వర్గాల లెక్క ప్రకారం... సాధారణ, లోటు వర్షపాతం నమోదైన పలు మండలాల్లో డ్రైస్పెల్స్‌ ఏర్పడిన ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి మండలాలు 50కి పైనే ఉన్నట్లు చెబుతున్నారు. మరో వారం వర్షాలు కురవకుంటే డ్రైస్పెల్‌ మండలాల సంఖ్య 75 వరకు పెరగవచ్చని అంటున్నారు. ఇక ఏదైనా మండలంలో కొన్ని గ్రామాల్లో వర్షాలు కురిసినా.. మరికొన్ని గ్రామాల్లో డ్రైస్పెల్‌ ఏర్పడిందని స్పష్టం చేస్తున్నారు.

డ్రైస్పెల్‌తో పంటలకు చేటు
రాష్ట్రంలో ఖరీఫ్‌లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. ఈసారి ఇప్పటివరకు 75.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 42.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావడం గమనార్హం. ఇక ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.72 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 25.90 లక్షల ఎకరాల్లో వేశారు. ఇందులో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 8.35 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. మొక్కజొన్న 13.20 లక్షల ఎకరాలకుగాను 9.82 లక్షల ఎకరాల్లో.. సోయాబీన్‌ 5.10 లక్షల ఎకరాలకుగాను 3.77 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. మొత్తంగా భారీగా సాగు జరిగిన పత్తి పంట పరిస్థితి ‘డ్రైస్పెల్‌’కారణంగా దారుణంగా మారింది. సోయా, మొక్కజొన్న, కంది, పెసర వంటి పంటలు కూడా ఎండిపోతున్నట్లు గుర్తించారు. లోటు వర్షపాతం నమోదైన 144 మండలాల్లో అనేక చోట్ల పంటలు ఎండిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికిప్పుడే మాట్లాడటానికి వ్యవసాయశాఖ వర్గాలు నిరాకరిస్తున్నాయి.

మందగించిన వరి నాట్లు..
ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 6.72 లక్షల ఎకరాల్లో (29%) మాత్రమే నాట్లు పడడం గమనార్హం. జూలై ముగుస్తున్నా నాట్లు ఊపందుకోకపోవడంపై వ్యవసాయశాఖ ఆందోళన చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసినా జలాశయాలు, చెరువులు, కుంటలు నిండలేదు. భూగర్భ జలాలు కొద్దిగా పెరిగాయంతే. జలాశయాలు, చెరువుల్లోకి వరద నీరు వచ్చేంతగా వర్షాలు లేకపోవడంతో వరి నాట్లు పుంజుకోలేదు. నీరు పుష్కలంగా ఉన్న బోర్లు, బావుల కింద మాత్రమే నాట్లు పడ్డాయి.

పత్తి విలవిల
మే చివరి వారం నుంచి జూన్‌ తొలివారంలో మధ్య వేసిన పత్తి పంట ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. ఇలాంటి సమయంలో వర్షాల్లేక డ్రైస్పెల్‌ ఏర్పడడంతో పత్తికి కొత్త సమస్య వచ్చి పడింది. ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లో ముందుగా వేసిన పత్తిని గులాబీ రంగు కాయతొలుచు పురుగు పట్టి పీడిస్తోందని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజాగా నిర్ధారించింది. మరిన్ని ప్రాంతాలకూ అది విస్తరించడం ఆందోళనకరంగా మారిందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. డ్రైస్పెల్‌ కారణంగానే పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉందని.. దీనివల్ల లక్షలాది ఎకరాల్లో పత్తి పంట ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.

వేడి పెరిగితే ఈ పురుగు సోకుతుంది
‘‘డ్రైస్పెల్‌ వల్ల వర్షాలు కురవక వేడి పెరుగుతుంది. దాంతో గులాబీరంగు పురుగు ఉధృతమవుతుంది. ఆ పురుగు వస్తే పత్తి చేతికందే పరిస్థితి ఉండదు. గతేడాది గుజరాత్‌లో గులాబీ రంగు పురుగు సోకిన పత్తి పంటను తగులబెట్టారు కూడా. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో సోకే ఈ పురుగు.. ఇప్పుడే సోకుతోందంటే పరిస్థితి దారుణంగా ఉన్నట్లే. దీనిని తట్టుకునేందుకు పురుగుమందులు వాడితే సాగు ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. అయినా పంట చేతికి వస్తుందన్న గ్యారంటీ లేదు..’’
– నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణులు, హైదరాబాద్‌

రెండు జిల్లాల్లో సమస్య..
‘‘ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లో ముందుగా వేసిన పత్తి పంటలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఉనికి గమనించాం. దాని ఉధృతి పెరగకుండా యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలి. పత్తి చుట్టూ బెండ లేదా తుత్తురు బెండగానీ లేకుండా చూసుకోవాలి. 5 శాతం వేపగింజల కషాయం లేదా 5 మిల్లీమీటర్ల వేపనూనెను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి..’’
– డాక్టర్‌ సుదర్శనం, శాస్త్రవేత్త (పత్తి), వరంగల్‌

>
మరిన్ని వార్తలు