కేసీఆర్‌ వైఫల్యంతోనే  రైతుల ఆత్మహత్యలు

4 Apr, 2018 09:19 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భూపాలపల్లి/మొగుళ్లపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వైఫల్యాల మూలంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య బస్సుయాత్ర మంగళవారం రాత్రి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లా మంథని నుంచి జిల్లాలోని కాటారం, భూపాలపల్లి, రేగొండ, చిట్యాల మీదుగా యాత్ర మొగుళ్ళపల్లికి చేరింది. మొగుళ్లపల్లిలో పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలగిరి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రఘుపతి కుటుంబాన్ని చూస్తే తనకు చాలా బాధ కలిగిందన్నారు. గత ఏడాది మిర్చి, ఈ ఏడాది పత్తి వేయగా గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యామని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. 24 గంటల కరెంటుతో బోర్లలో నీరు అడుగంటి పంటలు ఎండుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ కట్టించిన ఇందిరమ్మ ఇళ్లు అగ్గిపెట్టేల్లా ఉన్నాయని, తాను డబుల్‌ బెడ్‌రూం కట్టిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తాను పర్యటించిన జిల్లాల్లో ఒక్క డబుల్‌బెడ్‌ రూం ఇల్లు కూడా కనిపించలేదన్నారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను సీఎం కేసీఆర్‌ చంపించేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. అతడికి కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలిచిందన్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ చేసిన పాపాలు అన్నీఇన్ని కావని, అవి యాసిడ్‌ పోసి కడిగినా పోవన్నారు. స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి పాలాభిషేకాలు చేసినా, గోలీలాడినా వచ్చే ఎన్నికల్లో గెలవడన్నారు.

అనంతరం ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణను నాలుగేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ భ్రష్టు పట్టించిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్‌ను మొదటి నిందితుడిగా, రెండో నిందితుడిగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మూడో నిందితుడిగా మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీష్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. లేదంటే ఆత్మహత్య చేసుకున్న రైతుల ఆత్మలకు శాంతి చేకూరదన్నారు. నియోజకవర్గంలోని పంటలు ఎండుతున్నాయని, ఐదు రోజులు దేవాదుల నీటిని వదిలి చెరువులను నింపాలని తాను కోరితే శాసనసభాపతి మధుసూదనాచారి పట్టించుకోలేదన్నారు. తాను నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వారి సహకారంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పతనం చేసేందుకు పోరాడుతానన్నారు. గణేషుడికి చేసినట్లుగానే పాలాభిషేకం చేసి, చివరికి నిమజ్జనం చేయడం ఖాయమన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఎస్‌.జైపాల్‌రెడ్డి, , డీకే అరుణ, మల్లు రవి, దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర జ్యోతి, పొదెం  వీరయ్య, సీతక్క, దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆరెపెల్లి మోహన్, జనక్‌ప్రసాద్, విజయరామారావు, కొమురయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు