రుణ మాఫీ కోసం ఎదురుచూపు

30 May, 2014 03:18 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఈసారి జిల్లాలో ఖరీఫ్, రబీ పంటల రుణాలను అధికారులు లక్ష్యానికి మించి ఇచ్చారు.  2,26,282 మంది రైతులకు రూ.1,863.65 కోట్ల పంట రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్ల నివేదికలు తెలుపుతున్నాయి. 2013-14 వార్షిక రుణ లక్ష్యం 94.22 శాతం నెరవేరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రూ.53 కోట్ల మేరకు బంగారం తాకట్టుపై రుణాలిచ్చిందని నివేదికలిచ్చారు.  

2013-14 ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1152.6 కోట్లు కాగా రూ.1,075.24 కోట్లు ఇచ్చినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అదే విధంగా రబీ లక్ష్యం రూ.768.4 కోట్లు కాగా రైతులకు రూ.734.77 కోట్లు పంపిణీ చేసి 95.65 శాతం లక్ష్యం చేరుకున్నారు.. మొత్తంగా 2013-14లో రూ.1,921 కోట్లకు గాను రూ.1,810.01 కోట్లు పంపిణీ చేశారు.  పంటల రుణాలకు ఈసారి కూడ ప్రభుత్వం కనిష్టంగా, గరిష్టంగా ఎకరానికి ఎంత రుణం ఇవ్వచ్చన్న ప్రతిపాదనలను సూచించింది.  పత్తి పంట వేస్తే ఎకరం విస్తీర్ణానికి రూ.20 వేల నుంచి రూ.21,500 ఇవ్వాల్సి ఉండగా రూ.12 వేల నుంచి 13 వేలు ఇచ్చారు. అలాగే వరి పంటలు వేసిన రైతులకు ఎకరానికి రూ.19 వేల నుంచి రూ.20 వేల వరకు పంట రుణం ఇవ్వాల్సి వుండగా అధికంగానే ఇచ్చారు.

మరిన్ని వార్తలు