రూ. 10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి

19 Nov, 2018 02:46 IST|Sakshi

     ముసాయిదా మేనిఫెస్టోలో బీజేపీ హామీ

     మద్దతు ధరకు అదనంగా పంట కాలానికి ముందే బోనస్‌

     పంటల సేకరణ సమయంలో రైతు ఖాతాల్లో నేరుగా జమ

     రైతులు, రైతు కూలీలకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా

     ఉద్యోగులకు కనీసం వేతనం రూ. 26 వేలు

     ఇళ్లు లేని వారికి నెలకు రూ. 5 వేల ఇంటి అద్దె  

సాక్షి, హైదరాబాద్‌: పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను భారీగా పెంచి దానికి అదనంగా బోనస్‌ ఇచ్చేలా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. పంట సేకరణ సమయంలోనే ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని ముసాయిదా మేనిఫెస్టోలో పేర్కొంది. ఇందుకోసం కోసం రూ. 10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది. అలాగే రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విత్తనాల పంపిణీ, నకిలీ విత్తనాల నిరోధానికి జిల్లా స్థాయి ఉన్నతాధికారుల కమిటీలు, ప్రజలు, రైతులు, రైతు కూలీలకు రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా, విద్యార్థులకు సైకిళ్లు, 50 శాతం సబ్సిడీతో స్కూటీలు, ఉద్యోగుల కనీస వేతనం రూ. 26 వేలు చేయడం, నిరుద్యోగులకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి వంటి అంశాలతో సిద్ధం చేసిన ముసాయిదా మేనిఫెస్టోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌కు మేనిఫెస్టో కమిటీ ఇటీవల అందజేసింది. వాటిపై త్వరలోనే మరోసారి చర్చించి ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది. 

ముసాయిదా మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు 
- రైతులకు రూ . 2 లక్షల వరకు రుణమాఫీ. ప్రతి పొలంలో ఉచిత బోరుబావి. 
నాణ్యమైన విత్తనాలు ఉచితంగా పంపిణీ 
సన్న, చిన్నకారు రైతులు, రైతు కూలీలకు రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య, జీవిత బీమా 
ప్రత్యేక వ్యవసాయ వార్షిక బడ్జెట్, కూరగాయల ధరల స్థిరీకరణ నిధి. 
కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడం 
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సిన వనరులను కేటాయించి మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం. 
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటన. 
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 25 వేల మంది విద్యార్థులకు ఉచితంగా జేఈఈ, నీట్, పోటీ పరీక్షల శిక్షణ 
రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆయుష్మాన్‌ భారత్‌ యోజన ద్వారా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు. 
రాష్ట్రంలో కనీస వేతనం రూ. 26 వేలు చేయడం. 
సీపీఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం కొనసాగింపు. ్ఞ    నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి.  ్ఞ అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ విధానం ఎత్తివేత, పరీక్ష ఫీజుల రద్దు.
5 లక్షల మంది నిరుద్యోగ యువతకు హామీ లేని రుణాలు  
ఇళ్లులేని పేదలందరికీ ఉచితంగా ఇళ్ల నిర్మాణం, అవి నిర్మించి వరకు నెలకు రూ 5 వేలు అద్దె చెల్లింపు. 
బీపీఎల్‌ కుటుంబాల్లో 58 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 2 వేల పెన్షన్, వితంతువులకు రూ. 3 వేల పెన్షన్‌. 
వెనుకబడిన కులాల కార్పొరేషన్‌కు ఏటా రూ. 5 వేల కోట్లు కేటాయింపు. 
రజకులను ఎస్సీల్లో, గంగపుత్రులు, వడ్డెర కులస్తులను ఎస్టీల్లో చేర్చేందుకు చర్యలు. 
నేత, గీత, రజక, క్షార, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు తదితర కులవృత్తుల్లో 55 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 3 వేల పెన్షన్‌ 
జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్ల పెంపు. 
క్రీడారంగం అభివృద్ధికి రూ. 1,000 కోట్లతో క్రీడా నిధి ఏర్పాటు. వెయ్యిమంది క్రీడాకారులకు ఏటా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు స్కాలర్‌షిప్‌ మంజూరు. 
జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పెన్షన్‌. 
కల్యాణలక్ష్మి పథకంతోపాటు పేద మహిళలకు వివాహ సమయంలో ఒక తులం బంగారు మంగళసూత్రం. 
వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కేటాయింపులు రూ. 2 వేల కోట్లకు పెంపు. 
ఖాయిలాపడిన సంస్థల పునరుద్ధరణకు రూ. 2 వేల కోట్ల నిధి ఏర్పాటు.  ్ఞ జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఏటా రూ. 100 కోట్ల బడ్జెట్‌. 
రూ. 5 వేల కోట్లతో వెంచర్‌ కేపిటల్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి స్టార్టప్‌ కంపెనీలకు ప్రోత్సాహం. 
వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మంలలో ఐటీæ ఇంక్యుబేషన్‌ కేంద్రాల ఏర్పాటు. 
జనగామ, భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, మంచిర్యాల, సంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి, నిర్మల్, జగిత్యాల పట్టణాల్లో బీపీవోల ఏర్పాటు. 
జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటన 
సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహణ. 
పెట్రోల్, డీజిల్‌పై ధరలు కనీసం రూ. 20 తగ్గింపు 
గ్రామ పంచాయతీలు, నగరాలు, పట్టణాల్లో నెలకు రూ. 6కే çనల్లాల ద్వారా రక్షిత తాగునీటి సరఫరా.  

మరిన్ని వార్తలు