అన్నదాతల ఆందోళన

15 Mar, 2019 15:58 IST|Sakshi
పొట్టదశకు చేరుకున్న వరి 

మొదలైన విద్యుత్‌ కోతలు 

ఇబ్బందులు పడుతున్న రైతన్నలు 

సాక్షి, చొప్పదండి: వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.  ఇరువై రోజులుగా మండలంలో అప్రకటిత కోతలు అమలు చేస్తుండటంతో పంటలు సాగు చేసిన రైతులకు సమస్యగా మారింది. విద్యుత్‌శాఖ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తుండటంతో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు తికమక పడుతున్నారు. వ్యవసాయానికి ఇరువై నాలుగు గంటల కరెంటు సరఫరా చేస్తున్నా, వేసవి సమీపించడంతో అప్రకటిత కోతలు ప్రారంభమయ్యాయి. రబీ సాగుపై ఆశతో బావులపై ఆధారపడి పంటలు వేసిన రైతులకు కరెంటు కోతలు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ కోతలు ఉదయం, పగలు, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా అమలవుతుండటంతో రైతులు కరెంటు కోసం వేచి చూసే పరిస్థితి ఉంది.  


పొట్టదశలో పొలాలు 
ప్రస్తుతం రైతులు సాగు చేసిన వరి పంటలు పొట్టదశలో ఉన్నాయి. ఈసమయంలో తగినంత నీరు ఉంటేనే రైతులు ఆశించినట్లుగా పంట చేతికి వస్తంది. ఇక మొక్కజొన్న పంట కంకులు పాలుపోసుకొనే దశలో ఉన్నాయి. బావుల్లో నీటి మట్టం తగ్గుతుండటంతో ఒకవైపు రైతుల్లో ఆందోళన పెరుగుతుండగా, కరెంటు కోతలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యుత్‌ కోతలతో బావులలోని నీరు కాలువలు పారకానికే సరిపోతుందని, పగటి పూట తప్పని సరిగా విద్యుత్‌ కోతలు లేకుండా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

కోతల సమయం రైతులకు తెలయక పోవడంతో కరంటు కోసం రైతులు తమ సమయాన్ని వృథా చేసుకొనే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. చీకట్లో పొలాల గట్ల వెంట పురుగు పూసి ఉంటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులను సంప్రదించినా కరంటు కోతలపై స్పష్టమైన సమాచారం అందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

   
ముందస్తు సమాచారం ఇవ్వాలి 
రైతులకు పగటిపూట విద్యుత్‌ సరఫరా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈసమయంలో ముందస్తు ప్రకటన లేకుండా విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారు. కోతలపై ట్రాన్స్‌కో అధికారులు స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలి. ఇబ్బందులకు గురి చేయడం తగదు. కోతలుంటే ముందస్తు ప్రకటనలు చేయాలి. 
– జి రాజశేఖర్‌రెడ్డి, రైతు, చొప్పదండి 


కోతలు లేకుండా చూడాలి 
ఎలాంటి విద్యుత్‌ కోతలు లేకుండా ట్రాన్స్‌కో అధికారులు కరెంటు సరఫరా చేయాలి. ఇరువై నాలుగు గంటల కరెంటు సరఫరా ప్రకటనలతో పంటలు సాగు చేశాం. పంటలు చేతికి వచ్చే సమయంలో చెప్పా చెయ్యకుండా విద్యుత్‌ కోతలు విధించడం సరైన పద్ధతి కాదు. అధికారులు పట్టించుకోవాలి. 
– ఎం రవీందర్‌రెడ్డి, రైతు, చొప్పదండి

 
సమాచారం మేరకు వ్యవహరిస్తాం 
పవర్‌ గ్రిడ్‌ నుంచి వచ్చిన సమాచారం మేరకు నడుచుకుంటాం. అప్రకటిత కోతలు ఎప్పుడు ఉండవు. విద్యుత్‌ కోతలు అమలులో లేనందున, సమాచారం అందించడం ఏమీ ఉండదు. విద్యుత్‌ సరఫరాపై వస్తున్న సమాచారంతో వ్యవహరిస్తున్నాం. ఒక్కోరోజు విద్యుత్‌ సరఫరాలో కోతలు లేకుండా కూడా కరెంట్‌ సరఫరా చేస్తున్నాం. 
– రాజు, ఏఈ, ట్రాన్స్‌కో 

మరిన్ని వార్తలు