రైతుల ఆందోళన

28 Oct, 2017 18:31 IST|Sakshi

నారాయణఖేడ్‌:  కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆశయంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే అధికారులు కుంటిసాకులతో కొనుగోలు చేయడంలేదని ఆరోపిస్తూ.. క్రవారం నారాయణఖేడ్‌ మండలంలోని జూకల్‌ శివారులోని మార్కెట్‌ యార్డు వద్ద ప్రధాన రహదారిపై రైతులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. నారాయణఖేడ్‌–హైదరాబాద్‌ రాహదారిపై రైతులు బైఠాయించారు. కొందరు రోడ్డుపైనే భోజనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మినుములు కొనుగోలు చేసేందుకు నారాయణఖేడ్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించలేదన్నారు. పెసర్లు, మినుములు కొనుగోళ్లకు ఒకే అధికారిని నియమించారన్నారు.

 ఇక్కడ ప్రైవేట్‌ వ్యక్తులు ఆధిపత్యం చలాయిస్తున్నారని ఆరోపించారు. నిబందనల ప్రకారం 12 శాతంలోపు తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని తెలుపుతున్నప్పటికీ కొందరి రైతుల నుంచి అధిక శాతం తేమ ఉన్నా కొనుగోలు చేశారని కంగ్టికి చెందిన రైతు భూంరెడ్డి, ముబారక్‌పూర్‌కు చెందిన రైతు రాములు, చుక్కల్‌తీర్థ్‌కు చెందిన రైతు దిగంబర్‌రావు ఆరోపించారు. మార్కెట్‌ యార్డు వద్ద కనీస సౌకర్యాలు లేవన్నారు. టోకెన్ల ఆధారంగా అర్హులైన రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. 

ఆర్‌ఐ నారాయణ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. పెసర్లను తేమ శాతం అధికంగా ఉందని కొనుగోలు చేయకపోవడంతో మనూరు మండలం దుదగొండ గ్రామానికి చెందిన రైతు దావిద్‌ కంట తడిపెడుతూ ఆటోలో తీసుకెళ్లాడు. రైతుల ఆందోళనకు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్యం సంఘీభావం తెలిపారు. 

మరిన్ని వార్తలు