బీమా.. ధీమా

12 Jul, 2019 09:42 IST|Sakshi

తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం     

పత్తికి ఈనెల 15 వరకే బీమా గడువు

అవగాహన కల్పించని వ్యవసాయాధికారులు

పంటల వారీగా బీమా ప్రీమియం 

జిల్లాలో 2,21,614 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం

సాక్షి, సంగారెడ్డి: ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పంటల బీమాకు రైతుల నుంచి స్పందన కరువైంది. కొన్ని సంవత్సరాలుగా బీమా సదుపాయం కల్పిస్తున్నా రైతులు మాత్రం అతి తక్కువ ప్రీమియం చెల్లించడానికి సైతం ముందుకు రావడం లేదు. ఫసల్‌ బీమాపై ప్రచారం కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పథకంపై రైతులకు అవగాహన లేకపోవడంతో ఏటా పంటలను నష్టపోతున్నా పరిహారం అందని దయనీయ పరిస్థితి నెలకొంది. వాతావరణం అనుకూలించక పంటలు నష్టపోయే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్‌ బీమా పథకం ప్రవేశపెట్టింది. ఖరీఫ్‌లో రైతులు సాగు చేస్తున్న పంటలకు బీమా చేసుకునేందుకు ఈ నెల 15 నుంచి 31 వరకు గడువు ఇచ్చింది. క్షేత్ర స్థాయిలో అధికారులు రైతులకు సరైన సమాచారం చేరవేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ శాఖలో క్షేత్ర స్థాయిలో సిబ్బంది సరిపడా లేకపోవడంతో రైతులకు సమాచారం అందడం లేదు. పంటలకు బీమా చేసుకుంటే రైతులకు మేలు చేకూరుతుందనే వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నారు. పంటలు నష్టపోయినప్పుడు చూద్దాంలే అనుకుంటున్న రైతులు..నష్టపోయినప్పుడు మాత్రం గగ్గోలు పెడుతున్నారు.

గ్రామ, మండల యూనిట్ల వారీగా బీమా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలతో బీమా అవకాశాన్ని రైతులకు కల్పించింది. గతంలో పంటలు నష్టపోయినప్పుడు బీమా సొమ్మును అందించేందుకు బీమా సంస్థలు సవాలక్ష కొర్రీలు పెట్టడంతో బీమా చేయించడానికి రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. బీమా చెల్లించడమే కానీ నష్టపోయినప్పుడు డబ్బులు వచ్చిన దాఖలాలు తక్కువేనని రైతులు నిట్టూరుస్తున్నారు.

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు ఆలస్యమైనా ఇటీవలే అడపాదడపా కురుస్తున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్‌ పంటలు సాగు చేయడం ఆరంభించారు. విత్తనాలు విత్తుకుంటున్నారు. జిల్లాలో మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 2,21,614 హెక్టార్లు ఉంది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 39,807 హెక్టార్లుగా ఉంది. జిల్లాలో ప్రధానంగా కంది పత్తి, వరి, మినుము, పనుపు, పెసర, మొక్కజొన్న సాగు చేస్తారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యం కావడంతో ఇప్పటివరకు సుమారుగా 50 నుంచి 60 శాతం మాత్రమే సాగు విస్తీర్ణం నమోదైందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో మరో 10 రోజులవరకు విత్తనాలు వేసుకునే అవకాశం ఉండడంతో సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు తెలియజేస్తున్నారు.

రైతులకు భరోసాగా.. 
కేంద్ర ప్రభుత్వం ఫసల్‌ బీమా యోజన కింద రైతులు సాగు చేస్తున్న ఖరీఫ్‌ పంటలకు బీమా ప్రకటించింది. పలు పంటలను గ్రామ యూనిట్‌గా, మరికొన్నింటిని మండల యూనిట్‌గా లెక్కించనున్నారు. మొక్కజొన్న పంటను గ్రామ యూనిట్‌ పరిధిలో చేర్చారు. ఈ నెల 31 తేదీ వరకు ప్రీమియం డబ్బులు చెల్లించి బీమా పొందేలా అవకాశం కల్పించారు. అంతే కాకుండా పత్తి పంటకు ఈ నెల 15వ తేదీ గడువు విధించింది. వరి, పసుపు, కంది, సోయా, మినుము, పెసర, జొన్న పంటలకు మండల యూనిట్‌ జాబితాలో బీమా సౌకర్యం ప్రకటించారు. ఖరీఫ్‌లో రైతులకు తక్కువ వర్షపాతం, ప్రతికూల పరిస్థితులతో పంటలు నష్టపోతే బీమా పథకం వర్తిస్తుంది. 

మీ సేవా కేంద్రాల్లో
ఫసల్‌ బీమా పథకానికి సంబంధించి రైతులు మీ సేవ కేంద్రాల్లో బీమా ప్రీమియం డబ్బులను చెల్లించాలి. సహకార, గ్రామీణ, ఇతర జాతీయ బ్యాంకుల్లో పంట రుణాలను పొందిన రైతులకు బ్యాంక్‌ అధికారులే బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటారు. రుణం పొందని రైతులు వ్యవసాయాధికారులను సంప్రదిస్తే బీమా సౌకర్యం వివరాలను తెలియజేస్తారు.

యూనిట్‌ వారీగా బీమా.. 
 రైతులు పండిస్తున్న పంటలకు మూడు రకాల బీమా చేయనున్నారు. అందులో మొక్కజొన్న పంటలను గ్రామ యూనిట్‌ పరిధిలో చేర్చారు. గ్రామంలో మొక్కజొన్న పంట నష్టం వాటిల్లితే అదే గ్రామ పరిధిలోని విస్తీర్ణంలో దిగుబడిని బట్టి బీమా సొమ్మును చెల్లిస్తారు. అయితే కంది, జొన్న, వరి, సోయా, పెసర, మినుములాంటి పంటలను మండల యూనిట్‌ జాబితాలో చేర్చారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మండలాన్ని పరిగణలోకి తీసుకొని బీమా వర్తించే విధంగా నిబంధనలు రూపొందించారు. పత్తి పంటకు మాత్రం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బీమా వర్తించేలా ప్రభుత్వం ఫసల్‌ బీమాను అమలు చేస్తోంది. పంటలను బట్టి వాణిజ్య, సాధారణ పంటలుగా గుర్తించారు. వాణిజ్య పంటలకు బీమా పరిహారం అధికంగా ఉంటుంది. పత్తి, పసుపు పంటలు నష్టపోతే బీమాను అధికంగా చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

బీమా చేయించండి 
వాతావరణ విపత్కర పరిస్థితుల్లో పంటలు నష్టపోతే బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందవచ్చు. ప్రభుత్వం బీమా చేయించేందుకు ఈ నెలాఖరు వరకు పంటల వారీగా గడువు ఇచ్చింది. పంటలు సాగుచేస్తున్న రైతులు బీమా ప్రీమియం చెల్లించండి. పంటలు నష్టపోతే లాభదాయకంగా ఉంటుంది. 
  – బి.నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి

మరిన్ని వార్తలు