పామాయిల్‌ పంటకు ‘ఫసల్‌ బీమా’ వర్తింపు

7 Jul, 2018 11:44 IST|Sakshi
పామాయిల్‌ తోట  

రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే అవకాశం

బ్యాంకు రుణం పొందని  రైతులకు బీమా వర్తింపు

కల్లూరురూరల్‌ : పామాయిల్‌ సాగు చేసే రైతులకు ప్రధానమంత్రి ఫసల బీమా యోజన వర్తింపజేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు నోటిఫికేషన్‌ వెలువడింది. తెలంగాణలో కేవలం ఉభయ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రైతులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించారు.

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి, ఎర్రుపాలెం, మధిర, వైరా, పాలేరు, కూసుమంచి, నేలకొండపల్లి, బోనకల్‌ మండలాల్లో సుమారు పది వేల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేస్తున్నారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, జూలూరుపాడు, చండ్రుగుండ్ర మండలాల్లో సుమారు 25 వేల ఎకరాలలో పామాయిల్‌ సాగవుతుంది.

ప్రభుత్వ నిర్ణయంతో పామాయిల్‌ రైతులకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలు కానుంది. ఈ పథకంలో బ్యాంకు రుణం పొందిన రైతులకు ఫసల్‌ బీమా యోజన తప్పని సరిగా వర్తిస్తుంది. అదే విధంగా రుణం పొందని రైతులకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది.

ఇందులో బ్యాంకు అధికారులను సంప్రదించి ప్రీమియం ఫారం పొంది కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా బీమా నమోదు చేయించుకునే అవకాశం ఉంది. పామాయిల్‌ ఎకరానికి వర్తించే బీమా రూ. 35 వేలు కాగా, ఇందులో 5 శాతం ఎకరానికి రూ. 1750 రైతులు చెల్లించాల్సి ఉంటుంది.

పామాయిల్‌ రైతులు ఈ నెల 14 వ తేదీ లోపు తమ ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు సమీపంలోని బ్యాంకులు, వ్యవసాయ, ఉద్యాన వనశాఖ అధికారులను రైతులు సంప్రదించాలి.

మరిన్ని వార్తలు