కారుణ్య నియామకాలకు 1,344 మంది అర్హులు!

2 Aug, 2018 02:12 IST|Sakshi

సింగరేణిలో వేగవంతమైన నియామక ప్రక్రియ

అనర్హులైన కార్మికుల వారసులకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతమైంది. ప్రభుత్వ వైద్యులతో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్‌ బోర్డు 4 నెలల్లో 10 పర్యాయాలు సమావేశమైంది. మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 1,921 మంది ఉద్యోగులను పరీక్షించి 1,344 మంది ఉద్యోగానికి అనర్హులని తేల్చింది. మరో 227 మందిని పైస్థాయి వైద్యపరీక్షల కోసం రిఫర్‌ చేసింది. వీరిలో కూడా చాలామంది వైద్యపరీక్షల్లో అనర్హులయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

అనారోగ్య కారణాలతో అనర్హులైన కార్మికుల కుటుంబాల్లో వారు సూచించిన వారసుడికి ఉద్యోగావకాశం కల్పించేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. అన్ని ఏరియాల్లో దరఖాస్తులను స్వీకరించి ఉద్యోగ నియామకపత్రాలు అందజేస్తోంది. రామగుండం–1 ఏరియాలో డైరెక్టర్‌(ఆపరేషన్స్‌–పా) ఎస్‌.చంద్రశేఖర్‌ బుధవారం 40 మంది కార్మికుల వారసులకు కారుణ్య నియామకపత్రాలను అందజేశారు.

శ్రీరాంపూర్, బెల్లంపల్లి, రామగుండం–1 తదితర ఏరియాల్లో ఆగస్టు మొదటివారంలో కారుణ్య నియామకపత్రాలను అందజేయనున్నారు. వారసులకు కారుణ్యనియామక అవకాశం కల్పించేందుకు పదవీ విరమణ దరఖాస్తు చేసుకున్న కార్మికులందరికీ వైద్యపరీక్షలు చేస్తామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. మెడికల్‌ బోర్డ్‌ నిర్వహణ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని, పైరవీలకు అవకాశం లేదన్నారు. కార్మికులెవరూ ప్రలోభాలకు గురికావద్దని, ఎవరైనా పైరవీల పేరిట మోసం చేసేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు