కులాంతర వివాహం.. కర్రలతో కొట్టి చంపి.. కాల్చి బూడిద చేసి...

24 Dec, 2018 02:40 IST|Sakshi

జన్నారం(ఖానాపూర్‌): ప్రేమవివాహం చేసుకుని తమ పరువు తీసిందని కన్న తండ్రి, సోదరుడు ఆగ్రహించారు. ఆమెపై కర్రలతో దాడి చేసి ప్రాణం తీశారు. ఆనవాళ్లు కూడా మిగల్చకుండా మృతదేహా న్ని కాల్చి బూడిద చేసి కాలువలో కలిపేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలమడుగు గ్రామంలోని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన అయ్యోరు లక్ష్మణ్, యాదవ సామాజిక వర్గానికి చెందిన పిండి అనురాధ (22) గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

అక్టోబర్‌ చివరి వారంలో ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ఈ నెల 3న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇన్ని రోజులూ హైదరాబాద్‌లోనే ఉన్నారు. గొడవలు సద్దుమణిగాయని భావించి శనివారం తిరిగి స్వగ్రామం కలమడుగుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి పిండి సత్తయ్య, అన్న మహేశ్‌ తమ బంధువులతో కలసి శనివారం రాత్రి లక్ష్మణ్‌ ఇంటిపైకి దాడికి వెళ్లారు. అనురాధను బయటకు తీసుకువచ్చి ప్రేమ వివాహం చేసుకుని పరువు తీశావంటూ కోపంతో కర్రలతో కొట్టారు. కింద పడేసి తొక్కారు. స్పృహ కోల్పోవడంతో ఆమెను మోటార్‌సైకిల్‌పై ఇంటికి తీసుకెళ్లారు.  

రాత్రికి రాత్రే కాల్చేసి 
మోటార్‌సైకిల్‌పై ఇంటికి తీసుకెళ్లగానే అనురాధ మృతిచెందినట్లు గుర్తించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో గ్రామ సమీపంలోని దస్తురాబాద్‌ మండలం మల్లాపూర్‌ శివారులోని వారి పొలాల పక్కకు తీసుకెళ్లారు. అక్కడే మృతదేహాన్ని దహనం చేశారు. తెల్లవారు జామున బూడిద కనిపించకుండా ఎత్తివేసి సమీపంలోని నీటికాలువలో పారబోశారు. కాల్చిన చోట ఆనవాళ్లు లేకుండా నీళ్లతో శుభ్రం చేసి పై నుంచి గడ్డి కప్పివేశారు.  

పోలీసుల విచారణతో బయటపడ్డ నిజం 
అనురాధను తీసుకెళ్లి కొట్టారని భర్త లక్ష్మణ్‌ శనివారం రాత్రి 10 గంటల సమయంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనురాధ తరఫువారు తన అన్న, తండ్రిపై కూడా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే రాత్రి అదనపు ఎస్సై పోశెట్టి, సిబ్బంది కలమడుగులో విచారణ జరిపారు. ఆదివారం ఉదయం సత్తయ్య, మహేశ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయట పడింది.
 
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ 
సంఘటనాస్థలాన్ని మంచిర్యాల డీసీపీ వేణుగోపాల్, ఏసీపీ గౌస్‌బాబా పరిశీలించారు. అనురాధను కాల్చిన స్థలాన్ని, ఆనవాళ్లను పరిశీలించారు. బూడిద, ఎముకలు కనిపించాయి. వాటిని డీఎన్‌ఏ పరీక్షకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మణ్‌ను ప్రేమవివాహం చేసుకుని పరువు తీసిందనే కోపంతో కూతురు అనురాధను కర్రలతో కొట్టారని, అయితే దెబ్బలకు ప్రాణాలు పోవడంతో రాత్రికి రాత్రే కాల్చేసినట్లు తేలిందని అన్నారు. ఈ సంఘటనలో మృతురాలి అన్న మహేశ్, తండ్రి సత్తయ్యతోపాటు మరికొందరు బంధువులున్నట్లు విచారణలో తేలిందని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. 

ఇంటర్‌ చదివే రోజుల్లోనే ప్రేమ 
2013లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివే రోజుల్లోనే అనురాధ, లక్ష్మణ్‌ మధ్య ప్రేమ చిగురించింది. చదువు పూర్తయి, ఉద్యోగం సాధించాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లక్ష్మణ్‌ బీటెక్, అనురాధ డీఎడ్‌ పూర్తి చేశారు. అనురాధ ఇటీవల ఎస్‌జీటీలో ఎంపికైంది. లక్ష్మణ్‌ ప్రైవేట్‌ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, తమ కుటుంబీకులతో ప్రాణహాని ఉందని, పోలీసులు, మీడియా అండగా నిలిచి తమను కాపాడాలి.. అని అనురాధ అక్టోబర్‌ 24న ఓ వీడియో రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో గ్రామంలో వైరల్‌గా మారింది.  
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోలింగ్‌ సవాలే!

అక్రమ వెంచర్‌పై కొరడా

‘పాలమూరు’తో సస్యశ్యామలం 

వరంగల్, మహబూబాబాద్‌లకు రేపు ఖరారు

ఉర్సుకు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

సైరా కోసం బన్నీ..!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు