నాన్న.. నీ మమతే వెన్న!

21 Jun, 2020 08:03 IST|Sakshi
కూతురు తేజస్వినితో తండ్రి వెంకటేశ్వరరరావు

సాక్షి, హైదరాబాద్ ‌: ధరణికి గిరి భారమా.. గిరికి తరువు భారమా.. తరువుకు కాయ భారమా..  కని పెంచే తండ్రికి బిడ్డ భారమా.. అని కొత్తగా పాడుకోవాల్సి ఉంటుంది ఓ తండ్రి గురించి.. అమ్మ నవ మాసాలు మోసి కనీ.. పెంచీ.. కనిపించే ప్రత్యక్ష దైవమేతే.. నాన్న పిల్లల భారాన్ని మోసే అనురాగమూర్తి. వారి బురువూ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని అన్ని అవసరాలు తీర్చే ప్రేమైక స్ఫూర్తి. ఇదే కోవకు చెందినవారు రాంనగర్‌కు చెందిన బుజ్జి వెంకటేశ్వరరావు. ప్రత్యేక ప్రతిభావంతురాలైన కూతురును కంటిరెప్పలా చూసుకుంటున్నారు ఆయన. తల్లి సపర్యలు చేసినా తానూ బిడ్డకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. పోలియో బారినపడి నడవలేని అసహాయ స్థితిలో ఉన్న కుమార్తెకు తానే పాదాలై ముందుకు నడిపిస్తున్నారు. నేడు ఫాదర్స్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఇదీ..

రాంనగర్‌లోని బాప్టిస్ట్‌ చర్చి సమీపంలో నివసించే వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులు కూతురు తేజస్విని. ఈమెకు పుట్టుకతోనే పోలియో సోకడంతో కదల్లేని పరిస్థితి. ఆమెకు 24 ఏళ్లు. కాలు ఇంటి బయట పెట్టాలంటే మరొకరి సపోర్ట్‌ ఉండాల్సిందే. స్నానంతో పాటు ఇతర అవసరాలన్నీ తల్లి తీరుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు హయత్‌నగర్‌లోని తేజస్విని ఓ స్కూల్‌లో చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు రోజూ వదిలివచ్చేవారు. ప్రత్యేకంగా ఆటో కొనుగోలు అందులో తీసుకెళ్లి, ఇంటికి తీసుకొచ్చేవారు. రాంనగర్‌లో ఇంటర్‌ చదువుతుప్పుడు తరగతి గది మూడో అంతస్తులో ఉండటంతో తండ్రి వెంకటేశ్వరరావు కూతురును ఆటోలో గేట్‌ వరకు తీసుకెళ్లి అక్కడ నుంచి కూతురును భుజాలపై ఎత్తుకొని వెళ్లి మళ్లీ తీసుకొచ్చేవారు.

రెండేళ్లపాటు ఆయన రోజూ ఇలాగే చేశారు. మారేడ్‌పల్లిలోని కస్తూర్బా మహిళా కళాశాలో తేజస్విని మూడేళ్ల పాటు డిగ్రీ చదివినప్పుడు ఇదే విధంగా తరగతి గదిలో కూర్చోబెట్టి వచ్చేవారు. అనంతరం అదే కళాశాలలో ఆమె పీజీ (ఎంబీఏ) సీటు సంపాదించింది. ఆ రెండు సంవత్సరాలు కూడా తండ్రి అన్ని పనులూ మానుకొని కూతురికే అత్యధిక సమయం వెచ్చించారు. ఇలా 24 ఏళ్లుగా కూతురు సేవకే అంకితమయ్యారు తండ్రి వెంకటేశ్వరరరావు. దీంతో  కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అయినా అదేమీ పట్టించుకోలేదు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా కూతురును తన భుజాలపై మోసుకుంటూ తరగతి గదిలో కూర్చొబెట్టిన వెంకటేశ్వరరావును కస్తూర్బా మహిళా  కళాశాల వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యం ఆయనను సత్కరించడం విశేషం.  

నా పూర్వజన్మ సుకృతం..  
‘నన్ను 20 ఏళ్లుగా తన భుజస్కంధాలపై మోస్తున్నారు నాన్న. నేను ఏదైనా ఉద్యోగం సంపాదిస్తా. నా కోసం సర్వం ధారపోసిన తండ్రి రుణం తీర్చుకుంటా. కొన్ని ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగావకాశాలు వచ్చినప్పటికీ దూరం కావడం, ట్రాన్స్‌పోర్ట్‌ ఇబ్బందులు ఉండడంతో వద్దనుకున్నాను. త్వరలో జరగబోయే కామర్స్‌ పీహెచ్‌డీ ఎంట్రన్స్‌ కోసం,  గ్రూప్‌– 2కి ప్రిపేర్‌ అవుతున్నాను. వైకల్యంతో ఉన్నానని నేను ఏనాడూ బాధపడలేదు. ఇటువంటి తండ్రి దొరకడం నా పూర్వ జన్మసుకృతం’ అని చెబుతోంది తేజస్విని.  

మరిన్ని వార్తలు