పోలింగ్‌లో ప్రోబ్లమ్స్‌..

8 Dec, 2018 15:30 IST|Sakshi

ఖమ్మంఅర్బన్‌/కామేపల్లి/పాల్వంచ : నగరంలోని బల్లేపల్లిలోని 36వ పోలింగ్‌ స్టేషన్‌లోని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం) పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఉదయం పూట మొరాయించింది. దీంతో ఎన్నికల అధికారులు  మరో ఈవీఎం ఏర్పాటు చేశారు. అది కూడా మొరాయించింది. మళ్లీ ఇంకోటి తెచ్చి బిగించాక..రెండు గంటలకు పైగా ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైయింది. దీంతో..అంతసేపు ఓటర్లు నిరీక్షించాల్సి వచ్చింది. బల్లేపల్లిలో అత్యధికంగా ఓట్లు ఉన్న బూత్‌ కూడా ఇదే కావడంతో  వందలాది మంది క్యూకట్టారు. వికలాంగులు ఇబ్బంది పడ్డారు. రఘునాథపాలెంలోని  31వ నంబర్‌ పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎం ప్యాడ్‌ పని చేయకపోవడంతో ఇక్కడా ఆలస్యమైంది. చింతగుర్తిలోని 22 పోలింగ్‌ కేంద్రంలోని ఈవీఎంలో లోపం తలెత్తి ఓట్ల నమోదు నెమ్మదించింది. వృద్ధులు అంతసేపు క్యూలో నిలుచోలేక ఆరుబయట కుప్పలపై కూర్చోవాల్సి వచ్చింది. వేపకుంట్లలోని 61వ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం అంతరాయంతో ఆరగంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైనట్లు గ్రామస్తులు తెలిపారు.

ఈవీఎంల ద్వారా ఓటింగ్‌తోపాటు, అదనంగా ఓటు ఎవరికి వేసింది చూసుకోనే విధంగా ఏర్పాటు చేసిన ఈవీఎం ప్యాడ్‌తో పోలింగ్‌ పక్రీయ చాలా ఆలస్యంగా కొనసాగడంతో  తక్కువ ఓట్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో సైతం గంటల తరబడి ఉండటంతోపాటు, క్యూకట్టి చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చింది. కామేపల్లి మండలంలోని పండితాపురం, కొత్తలింగాలలో అర్ధగంట పాటు ఈవీఎంలు మొరాయించగా, మద్దులపల్లిలో గంటున్నర పాటు ఈవీఎం పనిచేయలేదు. కామేపల్లిలో కూడా ఇదే సమస్య తలెత్తింది. ఇక్కడ రాత్రి వరకు పోలింగ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి.  పాల్వంచ పట్టణంలోని రాతి చెరువు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 46 ఓట్లు పోల్‌ అయిన తర్వాత ఈవీఎం మొరాయించింది. ఇక్కడ గంట పాటు పోలింగ్‌ నిలిచింది. తహసీల్దార్‌ రవికుమార్‌ పరిశీలించి, కొత్తది ఏర్పాటు చేయించాక పోలింగ్‌ ప్రారంభమైంది. 

మరిన్ని వార్తలు