వామ్మో.. ఉల్లి సాగా!

7 Aug, 2015 23:47 IST|Sakshi
వామ్మో.. ఉల్లి సాగా!

నష్టాలకు భయపడి సాగు మానేసిన రైతులు
 
‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’.. ఇది కొనుగోలు చేసి వాడుకునే వినియోగదారుడికి. కానీ దీన్ని సాగు చేస్తున్న రైతుకు మాత్రం కోయక ముందే కన్నీళ్లు వస్తున్నాయి. పెట్టుబడులు భారమై, సీజన్‌లో ధరలు స్థిరంగా ఉండక, పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వస్తాయన్న నమ్మకం లేక సాగుకు పూర్తిగా స్వస్తి చెబుతున్నారు రైతులు. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో వినియోగదారుడు ధర పెట్టలేక లబోదిబోమంటున్నాడు. కొన్నేళ్ల క్రితం చేవెళ్ల వ్యవసాయ డివిజన్‌లో ఏ గ్రామంలో చూసినా ఉల్లిగడ్డ మండెలు (నిల్వ ఉంచేందుకు ఏర్పాటు చేసే ప్రత్యేక సదుపాయం) కోకొల్లలుగా కనిపించేవి. సుమారు 60 శాతం రైతులు ఎంతో కొంత విస్తీర్ణంలో ఉల్లి సాగుచేసేవారు. మరి నేడు..? ఉల్లి సాగు చేసేవారిని వేళ్లమీద లెక్కించవచ్చు.  
 
- పెట్టుబడి ఎక్కువ, ఆదాయం తక్కువని స్వస్తి  
- మార్కెట్‌లో స్థిరమైన ధర లేక ఇబ్బందులు
- సీజన్‌లో దెబ్బతీస్తున్న మహారాష్ట్ర ఉల్లి
- చేవెళ్ల డివిజన్‌లో ఒకప్పుడు భారీగా దిగుబడులు
- ప్రస్తుతం విపరీతంగా తగ్గిన పంట విస్తీర్ణం
- అందుకే డిమాండ్ పెరిగి ఆకాశంలో ధరలు
చేవెళ్ల :
ఉల్లిగడ్డ ధర విపరీతంగా ఈ పంటసాగుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉల్లి సాగు తగ్గడానికి రైతులు అనేక కారణాలు చెబుతున్నారు. నాట్లు వేసే దగ్గర నుంచి పంటను తీసేవరకు ఎకరానికి సుమారుగా రూ.15 వేల రూ.20 వేలు ఖర్చువస్తోంది. ఇటీవల పంటపై వైరస్ రావడం, చీడపీడలు, అనుకూలించని వాతావరణం తదితర కారణాలతో దిగుబడి తగ్గింది. కూలీల కొరత, పెరిగిన రేట్లు, ఫర్టిలైజర్ ధరలు భారీగా పెరగడం, లోకల్ విత్తనాలు లభించకపోవడం, మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎక్కువగా దిగుబడి కావడం తదితర కారణాలతో సాగుపై ఆసక్తి చూపడంలేదని రైతులు అంటున్నారు.

వర్షాభావ పరిస్థితులు సైతం ఉల్లిసాగుకు అవరోధంగా మారిందంటున్నారు. దీంతో గిట్టుబాటు కావడంలేదంటూ నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు. ధర కూడా ఎప్పుడెలా ఉంటుందో తెలియకపోవడంతో ఆసక్తి తగ్గిందంటున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి హైదరాబాద్, సదాశివపేట, మెదక్, సంగారెడ్డి, శంకర్‌పల్లి మార్కెట్లకు దిగబడులు అధికంగా రావడంతో లోకల్ ఉల్లిగడ్డ మార్కెట్లో తట్టుకోలేకపోయింది. రైతులకు ఏ రకంగానూ గిట్టుబాటు కాకపోవడంతో జిల్లాలో ఉల్లిగడ్డ సాగు గణనీయంగా తగ్గింది. మరో బలమైన కారణమేంటంటే.. పత్తి, మొక్కజొన్న,  కూరగాయపంటలు, పూల సాగుపై రైతులు ఎక్కువగా ఆసక్తి కనబరచడం కూడా ఉల్లిసాగు విస్తీర్ణం తగ్గడానికి కారణమైందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అందుకే ఉల్లిగడ్డ దిగుబడులు విపరీతంగా త గ్గిపోయి.. ధరలు పెరిగి వినియోగదారులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయనే వాదనలూ ఉన్నాయి.
 
పెట్టుబడి పెరిగింది
ఉల్లిగడ్డ సాగుకు పెట్టుబడి చాలా పెరిగింది. ఎప్పుడు ఏ రేటు ఉంటదో తెలియదు. ఒకసారి పెరుగుద్ది. మరోమారు తగ్గుద్ది. సీజన్ వచ్చే సరికి ధరలు తక్కువైతున్నయి. అందుకే సాగుకు మనసొప్పట్లే. కూలీల సమస్య కూడా ఉంది. దీంతో కూలీ రేట్లు బాగా పెరిగాయి. అధిక కూలీ ఇద్దామన్నా సమయానికి కూలీలు దొరకడంలేదు.

మరిన్ని వార్తలు