ఫిబ్రవరి 12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

23 Dec, 2014 01:02 IST|Sakshi
  • జంబ్లింగ్ లేకుండానే నిర్వహణ  
  • బోర్డు పాలక మండలి సమావేశంలో నిర్ణయం
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియెట్ బోర్డు పాలక మండలి సమావేశం సోమవారం బోర్డు కార్యాలయంలో జరిగింది. బోర్డు చైర్మన్‌గా జగదీశ్‌రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మార్చి 9 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్‌పరీక్షల ఏర్పాట్లపై ఈ సమావేశంలో సమీక్షించారు.

    నిర్ణీత సమయంలో పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రాక్టికల్స్ నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. ఈసారి పరీక్ష కేంద్రాల జంబ్లింగ్ లేకుండానే ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఇన్విజిలేటర్లుగా ఇతర శాఖల నుంచి ఉద్యోగులను కూడా తీసుకునే అంశంపై చర్చించారు.

    అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రాక్టికల్స్ కోసం 1,356 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాత పరీక్షలకు 1,250 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

    ఈసారి ప్రథమ సంవత్సర పరీక్షలకు 4,67,329 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 4,99,287 మంది విద్యార్థులు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లించిన ట్లు మంత్రి తెలిపారు. కాగా, ఎంసెట్ నిర్వహణ విషయంలో విభజనచట్టం ప్రకారమే ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, ఇంటర్ బోర్డు కార్యదర్శి శైలజారామయ్యార్, కన్సల్టెంట్ వీరభద్రయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు