ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒకటే ఫీజు

12 Jun, 2014 05:51 IST|Sakshi
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒకటే ఫీజు

- వైద్య ఆరోగ్య మంత్రి రాజయ్య వెల్లడి
- ప్రైవేటు ఎంసెట్‌కు వ్యతిరేకం  
 - లోపాల్లేకుండా ఆరోగ్యశ్రీ

సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సులకు ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎ, బి, సి కేటగిరీల బోధన ఫీజుల స్థానే ఒకటే ఫీజును తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ టి.రాజయ్య తెలిపారు. కోల్పోయిన మెడికల్ సీట్లను కూడా సాధిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్‌ను ఎంసెట్ కన్వీనరే నిర్వహిస్తారని, ఎన్టీఆర్ యూనివర్సిటీలోనే అడ్మిషన్లు జరుగుతాయన్నారు.

ప్రైవేటు ఎంసెట్‌కు తమ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. కాగా, తెలంగాణలో 200 సీట్లకు ఎంసీఐ అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఎంసీఐ అధికారులతో మాట్లాడానన్నారు. సంబంధిత కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.  రూ.100 కోట్లతో 154 ఎకరాల్లో ఘట్‌కేసర్‌లో నిమ్స్ ఆసుపత్రి నిర్మాణమవుతోందన్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో 177 ఎకరాల స్థలం ఉందనీ... అక్కడ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ ద్వారా చేతిముద్రతో హాజరు విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. లోపాలను సరిదిద్ది ఆరోగ్యశ్రీని అమలుచేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఫీజు వివరాలను వెల్లడించారు.

మరిన్ని వార్తలు