విదేశీ ఖైదీల విడుదల

30 Jan, 2018 15:12 IST|Sakshi
జైలులో తోటపని చేస్తున్న మలేషియా దేశస్తులు

‘ఫీల్‌ ది జైల్‌’లో రెండు రోజులు

ఖైదీల తరహాలోనే అన్ని పనులు

వినూత్న అవకాశమన్న క్వెన్, కెల్విన్‌

జైలు జీవితాన్ని ఇంటర్నెట్‌ ద్వారా పంచుకుంటామని వెల్లడి

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఫీల్‌ ది జైల్‌’లో భాగంగా సంగారెడ్డి జిల్లా పాత కేంద్ర కారాగారంలో రెండు రోజుల పాటు గడిపిన ఇద్దరు మలేషియా దేశస్తులు సోమవారం విడుదలయ్యారు. రోజుకు రూ.500 చొప్పున చెరో రూ.వేయి చెల్లించిన వీరు జైలు జీవితాన్ని అనుభవించారు. జైలులో సాధారణ ఖైదీలకు కల్పించే సౌకర్యాలనే జైలు అధికారులు వీరికి కూడా కల్పించారు. ప్రపంచంలో ఈ రకమైన అవకాశం ఎక్కడా లేనందునే.. ఇంటర్నెట్‌ ద్వారా తెలుసుకుని మరీ వచ్చామని ‘సాక్షి’కి వెల్లడించారు. మలేషియాకు చెందిన దంత వైద్యుడు క్వెన్, రెస్టారెంట్‌ యజమాని కెల్విన్‌ ఇద్దరూ స్నేహితులు. మలేషియాలోని జైలు మ్యూజియాన్ని సందర్శించిన వీరు ఇతర దేశాల్లోనూ జైలు మ్యూజియాల గురించి ఇంటర్నెట్‌లో శోధించారు.

ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారం (పాత)లో ‘ఫీల్‌ ది జైల్‌’ అనే వినూత్న అవకాశం ఉన్నట్లు తెలిసింది. జైలు సూపరింటెండెంట్‌ సంతోష్‌ కుమార్‌ రాయ్‌ను ఫోన్‌లో సంప్రదించిన వీరు.. ఫీల్‌ ది జైల్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన వీరు.. ఈ నెల 27న సంగారెడ్డికి చేరుకుని ‘ఫీల్‌ ది జైల్‌’ కోసం రూ.500 చొప్పున రెండు రోజుల కోసం ఇద్దరూ కలిసి రూ.2వేలు రుసుం చెల్లించారు. అనంతరం జైలు అధికారులు వీరికి సాధారణ ఖైదీల తరహాలో దుస్తులు, దుప్పట్లు తదితర సామగ్రి అందజేశారు. రెండు రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన ఈ ఇద్దరూ సోమవారం ఉదయం విడుదలయ్యారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

బయటి ప్రపంచంతో సంబంధం లేదు..
‘సాధారణ ఖైదీల తరహాలోనే రెండు రోజుల పాటు జైలు దుస్తులు ధరించాం. ఖైదీలకు ఇచ్చే అన్నం, పప్పు జిల్లా జైలు నుంచి తెప్పించి అందించారు. ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదు. సెల్‌ఫోన్, ఇతర కమ్యూనికేషన్‌ సాధనాలేవీ మాతో పాటు అనుమతించలేదు. దినచర్యలో భాగంగా మొక్కలకు నీళ్లు పట్ట డం, జైలు ఆవరణ శుభ్రం చేయడం వం టి పనుల్లో పాల్గొన్నాం. రెండు రోజుల పాటు ఒక ఇంగ్లిష్‌ దినపత్రికను అందించారు. 48 గంటల పాటు మేం అనుభవించిన జైలు జైవితాన్ని ఇంటర్నెట్‌ ద్వారా పంచుకునే ప్రయత్నం చేస్తాం.

ఐదురోజుల పర్యటనలో భాగంగా రెండు రోజులు జైలులో గడిపాం. మరో మూడురోజులు హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి స్వదేశానికి తిరిగి వెళ్తాం’ అని వెల్లడించారు. కాగా ఫీల్‌ ది జైల్‌లో ఇప్పటి వరకు 47 మంది తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇందులో ఏడుగురు మహిళలు సైతం ఉన్నారు. కర్ణాటక, మహా రాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా రాగా, తొలిసారి ఇద్దరు విదేశీయులు వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు.


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా