‘కుప్ప’కూలిన మహిళా రైతు

29 May, 2017 02:32 IST|Sakshi
‘కుప్ప’కూలిన మహిళా రైతు
కొనుగోలు కేంద్రంలో ఆగిన గుండె
 
సాక్షి జగిత్యాల/బుగ్గారం: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామనుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లిన ఓ మహిళా రైతు  జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండలోని సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో ఆదివారం  కుప్పకూలింది. వెల్గొండకు చెందిన మహిళా రైతు పల్లపు రాజవ్వ(50), భర్త నర్సయ్యకు ఐదెకరాల సాగు భూమి ఉంది. వారికి 20 క్వింటాళ్ల వరి దిగుబడి వచ్చింది. పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి ఇరవై రోజుల క్రితమే పంటను తీసుకెళ్లింది. కానీ, మొదటి పది రోజులు తేమ శాతం ఉందంటూ నిర్వాహకులు కొనుగోళ్లు నిరా కరించారు.

ఆ తర్వాత  గన్నీ బ్యాగులు అందుబాటులో లేక తూకానికి జాప్యం జరిగింది. ఇది వరకే.. తన భర్త నర్సయ్య అనారోగ్యం పాలవడంతో రాజవ్వ.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోనే వదిలిపెట్టి తరుచూ ఆస్పత్రికి.. ఇంటికెళ్లి వచ్చేది. చివరకు ఈ నెల 27న రాత్రి రాజవ్వకు కొనుగోలు కేంద్రంలో రాజవ్వకు గన్నీ సంచులు దొరికాయి. దీంతో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకే కొనుగోలు కేంద్రానికి వచ్చిన రాజవ్వ.. తన పంట దగ్గర ఎండలోనే నిలబడి గన్నీలో ధాన్యం నింపడం ప్రారంభించింది. ఈ క్రమంలో అస్వస్థతకు గురై.. గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలింది. విషయాన్ని గ్రహించిన స్థానిక రైతులు రాజవ్వను వెంటనే చెట్టు నీడకు తీసుకొచ్చి... పరీక్షించగా అప్పటికే ఆమె చనిపోయింది.

 

మరిన్ని వార్తలు