వెలుగులేని జీవితాలు

25 May, 2016 00:13 IST|Sakshi

దయనీయ స్థితిలో డిస్మిస్డ్ కార్మికుల కుటుంబాలు
నాగాల పేరుతో తొలగించిన సింగరేణి
సంవత్సరాల తరబడి నిత్య నరకం
సీఎం కేసీఆర్ నిర్ణయంపైనే ఆశలు

 

సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు అప్పటి ప్రభుత్వం, యాజమాన్యం కలిసి తీసుకున్న ఒక నిర్ణయం వేలాది మంది కార్మికుల జీవితాలను ఛిద్రం చేసింది. అది ఎంతగా అంటే.. వారు తరతరాలు కోలుకోలేనంతగా దెబ్బతీసింది. కేవలం విధులకు సక్రమంగా హాజరుకావడం లేదనే సాకుతో నిర్ధాక్షిణ్యంగా విధుల నుంచి డిస్మిస్ చేసింది. ఈ ప్రక్రియ 1993 నుంచి 2010 వరకు కొనసాగింది. సుమారు 12000 మంది రోడ్డున పడ్డారు. ఇలా కొలువు పోయిన రందితో అనారోగ్యం పాలై కొందరు తనువు చాలించారు. మరి కొందరు కనీసం తిండిగింజలు కూడా దొరక్క ఆకలి చావులకు గురయ్యారు. మరి కొందరు ప్రాణాలతో మిగిలి ఉన్నా దీనమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొలువుతోపాటు ఇంటి పెద్దనూ కోల్పోయిన కుటుంబాల సభ్యులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. ఏ తప్పూ చేయకుండానే ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ ఏనాటికైనా న్యాయం చేస్తుందనే నమ్మకంతో వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసానే నేడు వారిని బతికిస్తోంది. ఈ సందర్భంగా ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన పలువురు డిస్మిస్డ్ కార్మికుల కుటుంబ సభ్యులు తమ గోసను ‘సాక్షి’తో చెప్పుకున్నారు.  - మందమర్రి(ఆదిలాబాద్)

 

అప్పుచేసి పిల్లల పెండ్లి చేసిన
నా పెనిమిటి కాంపెల్లి రాజిరెడ్డి మందమర్రి కేకే-5 గనిలో టింబర్‌మెన్‌గా పనిచే సిండు. కాళ్ల నొప్పులు, ఛాతినొప్పులతోని డ్యూటీకి సక్కగ పోలేదు. 1999లో నాగాలు ఎక్కువైనయని డిస్మిస్ చేసిండ్లు. అప్పటి వరకు ఏ లోటు లేకుంట బతిక మాకు కష్టాలు మొదలైనయి. ఆ బాధలతోనే ఆయన 2002లో చనిపోయిండు. కూలి పనుల కు పొయ్యి ఐదుగురు పిల్లలను సాదు కుంటాన. అప్పులు చేసి ఇద్దరు ఆడపిల్లలకు పెండ్లి చేసిన. అప్పులు తీరక నానా తంటాలు పడుతున్న.      - కాంపెల్లి కనకమ్మ, ఎర్రగుంటపల్లె

 

బడికి పంపే స్థోమత లేక..
మా ఆయన చెన్నూర్-1 ఇన్‌క్లైన్‌లో పనిచేసిండు. గ్యాస్, దుమ్ముకు తట్టుకోలేక డ్యూటీకి నాగాలు పెట్టేది. సింగరేణోళ్లు 2002 సంవత్సరం నాగాలు ఎక్కువ చేత్తాండని డిస్మిస్ చేసిండ్లు. రెండేండ్లు కూలి పనులు చేసి మమ్ములను సాదిండు. 2004ల ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయిండు. పెద్దదిక్కును కోల్పోవడం తో ముగ్గురు పిల్లలను చదివించే స్థోమత లేక నాతో పాటే కూలి పనికి తీసుకపోయి వచ్చిన డబ్బులతో పొట్టపోసుకుంటానం.           - మల్లెత్తుల సత్తమ్మ, భీమారం

 

చేతిలో చిల్లిగవ్వ లేదు
మా ఆయన గోలేటి-2లో మైనింగ్ సర్దార్‌గా పనిచేసిండు. కొన్నేండ్ల కింద బాయిపని చేయబట్టి అనారోగ్యానికి గురికావడంతో డ్యూటీకి సక్రమంగా పోలేదు. దీంతో 1998 సంవత్సరంల సింగరేణి సార్లు గైర్హాజరైతాండని పెనిమిటిని బాయి నౌకరి నుంచి తీసేండ్లు. కూలి నాలి చేసి మమ్ములను సాదిండు. పూట పూటకూ ఇబ్బందులే. ఎట్ల బతకాలనే రంది పెట్టుకున్నడు. దాంతోనే ఆయన 2002లో పానమిడిసిండు. అప్పటి నుంచి నేను.. ముగ్గురు పిల్లలు.. పడరాని కష్టాలు పడుతున్నం. రోజు గడవడమే కష్టంగా ఉంది. పిల్లలు పెండ్లికి ఎదిగిండ్లు. చేతిలో చిల్లి గవ్వ లేదు.                                  - ఎలికటి మరియ, గోలేటి

 

కూలి పనికిపోయి బతుకుతానం
నా భర్త పొట్ట రాములు కాసిపేట గనిలో కోల్ ఫిల్లర్‌గా పనిచేసేది. పానం బాగలేక నౌకరికి నాగాలు పెడితే 2000 సంవత్సరంల కంపెనీ డిస్మిస్ చేసింది. గప్పటి నుంచి జీతం లేదు. ఐదుగురు పిల్లలను సాదలేక రందితోని మంచం పట్టి 2005లో చనిపోయిండు. కూలి పనులు చేసుకుంట పిల్లలను బతికించుకుంటాన.  - పొట్ట లక్ష్మి, మందమర్రి

 

అందరికీ న్యాయం చేయాలి
గైర్హాజర్ పేరుతో డిస్మిస్ చేసిన కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగం ఇవ్వాలి. వృద్ధాప్యానికి చేరిన వారితోపాటు మృతి చెందిన డిస్మిస్డ్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కంపెనీ ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలి. డిస్మిస్డ్ కార్మికులకు న్యాయం చేయాలని 12 ఏళ్లుగా ఎన్నో ఆందోళనలు, దీక్షలు చేస్తూనే ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తమ సమస్యను సీమాంధ్ర పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిస్మిస్డ్ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఆశతోనే ఎదురు చూస్తున్నం.

 - బీదబోయిన రవీందర్,  డిస్మిస్డ్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి

 

మరిన్ని వార్తలు