రైతులను వేధిస్తున్న ఎరువుల కొరత

3 Sep, 2019 12:00 IST|Sakshi

సాక్షి, నిజామబాద్‌: ఎరువుల కొరతతో జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం రైతులు ఎరువు బస్తాల టోకెన్ల కోసం క్యూ కట్టి గంటల తరబడి లైన్‌లో నిలబడ్డారు. కొన్ని చోట్ల గడ్డలు కట్టిన బఫర్‌ స్టాక్‌ ఎరువులను ఇస్తున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో నిజామాబాద్‌ జిల్లాకు 60 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 42వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే వచ్చింది. వర్షాలు పడుతుండటంతో సాగు పనులు మొదలుపెట్టిన రైతులు ఎరువుల కొరతతో సాగు కానిచ్చేదెలా అని ఆందోళన చెందుతున్నారు. కాగా ఆగస్టు నాటికే 54 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువు అవసరం ఉంది. ఇక రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో జిల్లాలో వరినాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు 2,30,000 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఇది సాధారణం కన్నా 112 శాతం అధికం. సరైన సమయంలో ఎరువులు అందకుంటే పంట నష్టపోయే ప్రమాదమున్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు