సిండి‘కేటు’ 

23 Jul, 2018 12:37 IST|Sakshi
దుకాణాల నుంచి ఎరువులను కొనుగోలు చేస్తున్న రైతులు

అల్లాదుర్గం(మెదక్‌) : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఎరువుల వ్యాపారుల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.  ఉమ్మడి అల్లాదుర్గం మండలంలోని ఫర్టిలైజర్‌ దుకాణాల్లో సిండికేట్‌ దందా ప్రారంభించి   రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతులకు కావల్సిన ఎరువులు, ఫెస్టిసైడ్, విత్తనాలను ఉద్దేరకు ఇస్తూ ఆ డబ్బుపై అధిక వడ్డీలు వేస్తూ మోసం చేస్తున్నారు. దీనికితోడు రైతులు పంట వచ్చిన తర్వాత ఆ పంటను  ఉద్దెర ఇచ్చిన ఫర్టిలైజర్‌ దుకాణాదారులకే విక్రయించాలనే ఒప్పం దంపై ఎరువులు,విత్తనాలు అరువు ఇస్తున్నారు. ధర కూడా వారు చెప్పిన దానికే అమ్మాలి. ఉద్దెర సొమ్ముకు వందకు రూ. 5 వడ్డీని వసూలు చేస్తూ రైతుల నడ్డి విరిస్తున్నారు. పత్తి కొనుగోళ్ల  సమయంలోనూ తూకంలో మోసాలకు పాల్ప డుతూ అందినకాడికి దోచుకుంటున్నారు.   ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.  ఈ దందా అల్లాదుర్గం ఉమ్మడి మండలంలో ఐదేళ్లుగా యథేచ్చగా కోనసాగుతుంది.

ఒక్కో గ్రామం ఒక్కో దుకాణం..
ఉమ్మడి అల్లాదుర్గం మండలంలో సుమారు 45  ఫర్టిలైజర్‌ దుకాణాలున్నాయి. పేరుకు ఇవి ఉన్నా ప్రతి గ్రామంలో అక్రమంగా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు.   ఈ వ్యాపారులంత సిండికెట్‌గా మారి యూరియా బస్తాపై 20, నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఉద్దెర తీసుకున్న రైతులు మాత్రం ఏమీ అనడం లేదు. నగదు ఇచ్చి కొనుగోలు చేసే రైతులు ప్రశ్నిస్తే ఇదే ధరకు ఇస్తాం కొంటే , కొనండి లేకుంటే మీ ఇష్టం అని దురుసుగా సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల బిల్లు మాత్రం ఉన్న రేటు వేసి, అదనంగా వసూలు చేసేది వేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా ఏమీ లాభం లేకుండా పోతుంది. ఈ వ్యాపారులు అందరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఆ గ్రామంలో వేరే దుకాణాల వారు విక్రయించొద్దని నిబంధనలతో విక్రయిస్తున్నారు. ఒక షాప్‌ వారు అమ్మే ఊరికి వేరే దుకాణాల వారు అమ్మోద్దని నిబంధనతో విక్రయిస్తున్నారు.

గ్రామానికో బ్రోకర్‌..
దుకాణదారులు ఈ మండలంలో ప్రతి గ్రామంలో కొంత మంది బ్రోకర్లుగా పెట్టుకుని అక్రమ ఎరువులు, విత్తనాలు, ఫెస్టిసైడ్‌ మందులు విక్రయిస్తున్నారు.  వట్‌పల్లి కేంద్రంగా ఎటువంటి అనుమతులు లేకుండా జీరో దందా జోరుగా సాగుతోంది.  ఒక్కో వ్యాపారి కోటి రూపాయలపైనే ఉద్దెర ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వట్‌పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కల్తీ విత్తనాలు అమ్మడంతో ముప్పారం గ్రామానికి చెందిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.  వ్యవసాయాధికారులు విచారణ జరిపినా ఆ వ్యాపారిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు.  అధిక ధరలకు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు అటు వైపు కన్నేత్తి చూడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ  సిండికేట్‌ వ్యాపారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

తీవ్రంగా మోసం చేస్తున్నారు
ఫర్టిలైజర్‌ షాపు యజమానులు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిలువునా మోసం చేస్తున్నారు. ఉద్దెర పెరుతో అధిక ధరలకు మందులకు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే అదనుగా భావించి నకిలీ మందులు, విత్తనాలు అమ్ముతున్నారు. గత ఏడాది నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయాం. 
     – నాగరాజు రైతు, ముప్పారం. 

చర్యలు తీసుకుంటాం..
ఈ సిండికేట్‌ అక్రమ వ్యాపరం గురించి మా దృష్టికి రాలేదు. మండల వ్యవసాయ అధికారి ద్వారా  విచారణ చేపడతాం. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు ఎరువులకు బిల్లులు తప్పని సరిగా తీసుకోవాలి. అధిక ధరలకు విక్రయించినా, అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. 
–పరుశురాం నాయక్, జిల్లా వ్యవసాయాధికారి

మరిన్ని వార్తలు