గురువులకు ప్రమోషన్ల పండుగ

26 Jun, 2019 02:55 IST|Sakshi

యాజమాన్యాలవారీగా టీచర్లకు పదోన్నతులు 

మార్గదర్శకాల రూపకల్పనకు సర్కారు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నాలుగేళ్లుగా పదోన్నతులు లేక తీవ్ర అసంతృప్తిలో ఉన్న టీచర్లను ప్రమోషన్లతో గౌరవించాలని నిర్ణయించింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా యాజమాన్యాలవారీగా పదోన్నతులు కల్పించడానికి సర్కారు అంగీకారం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అధ్యక్షతన మంగళవారం జరిగిన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2015 తర్వాత టీచర్లకు ఇప్పుడు పదోన్నతులు లభించబోతున్నాయి. విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో విద్యాశాఖ, న్యాయశాఖ, ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ అధికారులతో సీఎస్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ సమస్యతో నాలుగేళ్లుగా పదోన్నతులు ఆగిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి న్యాయ వివాదాలూ తలెత్తకుండా చూసేందుకు యాజమాన్యాల వారీగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. ముందుగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పండిట్లు, పీఈటీల అప్‌గ్రెడేషన్‌కు ఉత్తర్వులు జారీచేసినందున వారికి ప్రయోజనం కల్పించేలా వాటిని అమల్లోకి తీసుకురానున్నారు. మిగతా కేడర్ల విషయంలోనూ వివాదాలు తలెత్తకుండా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 

వివాదాలకు తావులేని రీతిలో మార్గదర్శకాలు.. 
రాష్ట్రంలో దాదాపు 68వేల మందికి పైగా ఎస్జీటీలు ఉండగా, 40వేల మందికి పైగా స్కూల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యాలవారీగా పదోన్నతులు కల్పిస్తే ఎవరి నుంచి అభ్యంతరాలు రావని భావిస్తున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు యాజమాన్యాల వారీగా ఏ యాజమాన్యం వారికి ఆ యాజమాన్యంలోనే పదోన్నతులు కల్పించడం ద్వారా సబ్జెక్టుల నిపుణుల కొరతను తీర్చవచ్చని యోచిస్తున్నారు. గతంలో బదిలీలు చేపట్టినపుడు తెలంగాణ పాత జిల్లాలవారీగా చేశారు. అయితే పదోన్నతులు మాత్రం కొత్త జిల్లాల వారీగానే ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో.. ఆ మేరకే ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. తొలుత 31 జిల్లాలు ఉండగా.. తర్వాత ప్రభుత్వం మరో రెండు జిల్లాలను ప్రకటించింది. ప్రస్తుతం ఆ రెండు జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చేందుకు చర్యలు చేపట్టింది.

ఆ ప్రక్రియ పూర్తయ్యేనాటికి ఉపాధ్యాయ పదోన్నతులకు అంతా సిద్ధం చేసి ఉంచాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించి పంపించాలని సీఎస్‌ జోషి ఆదేశించారు. ఏ స్థాయిలోనూ వివాదాలకు అవకాశం ఇవ్వని రీతిలో మార్గదర్శకాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలవారీగా పోస్టుల విభజనకు కూడా మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. కొత్త జిల్లాల్లో కొన్నింటిలో ఎక్కువ పోస్టులు ఉంటే కొన్నింటిలో తక్కువ పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి విభజన శాస్త్రీయంగా ఉండాలని, న్యాయ వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా పదోన్నతులు చేపట్టేందుకు అందరి అభిప్రాయాలను తీసుకొని మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన సూచించారు. వాటన్నింటినీ సిద్ధం చేసి సాధారణ పరిపాలన శాఖకు పంపిస్తే, సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని, అనంతరం మరో సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు