యువతుల కొంపముంచిన టిక్‌టాక్‌ పరిచయం

10 Nov, 2019 10:54 IST|Sakshi

ఆన్‌లైన్‌ పరిచయాలను గుడ్డిగా నమ్ముతున్న  దుస్థితి

అవగాహన లేక మోసపోతున్న వైనం

సాక్షి, గజ్వేల్‌: గజ్వేల్‌ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామంలో ‘టిక్‌ టాక్‌’ పరిచయంతో మోసపోయిన ఇద్దరు యువతుల ఉదంతం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. పలు సమాచార యాప్‌లపై అవగాహన లోపంతో  చోటు చేసుకునే పరిణామాలను ఈ ఘటన కళ్లకు కట్టింది. ప్రస్తుతం ఆ యువతులను తిరిగి స్వగ్రామానికి తీసుకురావడానికి కుటుంబీకులు తరలివెళ్లారు. బాధితులు ఇంటికి చేరుకున్న తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.

పదో తరగతి వరకుచదువుకున్న ఇద్దరు యువతుల్లో ఒకరు 19, మరొకరు 21 సంవత్సరాల వయసు కలిగిఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ వారి కుటుంబాలకు అండగా ఉంటున్నారు. కొంతకాలం మేడ్చల్‌లోని ఓ కంపెనీలో పనిచేశారని.. ప్రస్తుతం గజ్వేల్‌ పట్టణంలోని ఓ మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఆరు నెలల క్రితం అనంతపురం జిల్లా దర్గా హొన్నూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వీరి మధ్య ప్రేమ చిగురించేలా చేయడం...  పెళ్లి చేసుకోవడానికి అక్కడికి వెళ్లి మోసపోయిన సంగతి తెలిసిందే. పేదరికం, అవగాహన లోపమే ఆ ఇద్దరు యువతులు మోసపోవడానికి కారణంగా అందరూ చర్చించుకుంటున్నారు. చదువు మానేసిన తర్వాత కూలీ పనులు చేయడం ఎంచుకున్న ఆ ఇద్దరు క్రమంగా ‘టిక్‌టాక్‌’కు అలవాటుపడ్డారు. ఈ యాప్‌ ద్వారా ఏర్పడే పరిచయాలను నిజమని నమ్మారు.

ఆరు నెలల పాటు దీన్ని కొనసాగించారు. చివరకు అనంతపురం జిల్లాకు వెళ్లిన తర్వాత యువకులు మాట మార్చడంతో తాము మోసపోయినట్లు ఆలస్యంగా తెలుసుకొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై బొమ్మనహాళ్‌ పోలీసులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. 

వెలుగులోకిరాని ఘటనలెన్నో.... 
సమాచారాన్ని సులభతరం చేసే యాప్‌లపై అవగాహన లోపంతో అమాయకులు మోసపోవడం సహజ పరిణామంగా మారుతోంది. అవసరం మేరకే యాప్‌లను వాడాలనే వాస్తవాన్ని చాటుతోంది. తాజాగా మక్తమాసాన్‌పల్లి ఘటన అందిరినీ నిర్ఘాంతపోయేలా చేసింది. ఇలాంటి సంఘటనలు ఈ ప్రాంతంలో జరగడం కొత్తేమీ కాదు. కాకపోతే వెలుగులోకి రాకపోవడం వల్ల విస్తృతస్థాయి చర్చ జరగలేదు. ప్రేమ పేరుతో ఎంతో మంది వివిధ రకాల యాప్‌ల మోజులో పడుతున్నారు.

ఇటీవల గజ్వేల్‌ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి వారి వీడియోలను ఓ యాప్‌లో విడుదల చేశారు. ఈ వీడియోను చూసిన సంబంధిత కుటుంబీకులు ఆందోళనలో మునిగిపోయారు. యువకుడు మేజర్‌ అయినప్పటికీ యువతి మాత్రం మైనర్‌ కావడంతో వారి కుటుంబీకులను ఆందోళనకు గురిచేస్తోంది. మరో జంట కూడా రాష్ట్రంలోనే వేరే ప్రాంతానికి వెళ్లి ఇదే రకమైన వీడియోలతో తమ కుటుంబీకులను గురయ్యేలా చేసింది.

‘సోషల్‌ మీడియా’ ద్వారా ఎంతోమంది పరిచయాలు  పెంచుకుంటుండగా...ఎక్కువగా అవి మోసాలుగా మిగిలిపోతున్నాయి. తాజా ఘటన వివిధ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా