‘ఫైబర్‌’ మ్యూజియం

23 Aug, 2018 11:52 IST|Sakshi
మొసలి

కిన్నెరసానిలో జంతువుల బొమ్మల ఏర్పాటు

పాల్వంచరూరల్‌ : కిన్నెరసాని లో జంతువుల బొమ్మలతో ఏర్పాటు చేసిన మ్యూజియం ఆకట్టుకుంటోంది. అహ్మదాబాద్‌కు చెందిన కళాకారులను రప్పించి వివిధ రకాల వన్యప్రాణుల బొమ్మలను తయారు చేయించారు. ఆరు నెలల క్రితం ప్రారంభించిన ఈ మ్యూజియం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.  కేంద్రప్రభుత్వం మంజూరు చేసి న నిధులతో కిన్నెరసానిలోని పర్యావరణ విద్యాకేంద్రాన్ని వన్య మృగాల సంరక్షణ విభాగం పర్యవేక్షణలో ఆధునికీకరించారు.

కిన్నెరసాని అభయారణ్యంలో సంచరించే 24 రకాల అరుదైన జంతువుల బొమ్మలను అహ్మదాబాద్‌కు చెందిన ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌కు చెందిన కళాకారులు ఫైబర్‌ వస్తువులతో రూపొందించా రు. వీటిని రెండు ఏసీ గదుల్లో ఉంచారు. విద్యాకేంద్రంలోకి ప్రవేశించగానే ఎదురుగా మొసలి బొమ్మ కన్పిస్తుంది. పక్కనే ఉన్న గదిలో ఒక చెట్టుపై నెమలి, గుడ్లగూబ, చెట్టు కింద కొండ చిలువ పాము, కొంగ తదితర బొమ్మలు దర్శనమిస్తాయి.

మరోగదిలో ప్రధానంగా అడవి దున్న, మొసలి, చిరుత,పులి, కొంగ, ఉడు ము, ఎలుగుబంటి, చుక్కల దుప్పి తదితర జంతువుల బొమ్మలను ఉంచారు. వృక్షాలు, జలాశయానికి సంబంధించిన షార్ట్‌ ఫిలిం థియేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 50మంది ఒకేసారి కుర్చోని వీక్షించ వచ్చు. వివిధ పక్షుల కిలకిలరావాలు, జంతువుల అరుపులకు సంబంధించిన ఆడియో రికార్డులను, వాటి చిత్రాలను కూడా అందుబాటులో ఉంచారు.

రూ.20లక్షల వ్యయంతో.. 

రూ.20లక్షలతో వివిధ రకాల జంతువుల బొమ్మ లను తయారు చేసి పర్యావరణ విద్యాకేంద్రంలో ఏర్పాటు చేశాం. పర్యాటకులకు ఆహ్లాదాన్ని కల్గించేవిధంగా ఉంటా యి. షార్ట్‌ ఫిలిం థియేటర్‌ కూడా ఏర్పాటు చేశాం. మ్యూజియం ప్రారంభించిన తర్వాత నుంచి పర్యాటకుల స్పందన పెరిగింది. కిన్నెరసానిలో ఆహ్లాదంతోపాటు విజ్ఞానం కూడా అందిస్తున్నాం.  

-నాగభూషణం, వైల్డ్‌లైఫ్‌ ఎఫ్‌డీఓ  
 

మరిన్ని వార్తలు