ష్... అంతా సీక్రెట్

28 Feb, 2015 00:39 IST|Sakshi

రంగంలోకి ఇసుక మాఫియా
రాష్ట్ర స్థారుులో డెరైక్షన్
అధికారులే సూత్రధారులు
సొసైటీ పేరిట దళారుల పరం
ఖరారు కాకముందే యంత్రాల చేరిక
హడావుడిగా 34 ఎకరాల్లో స్టాక్ యార్డ్
పేర్లు లేవని పనులు అడ్డుకున్న ప్రజలు
 

వరంగల్ రూరల్ : గోదావరిలో ఇసుక క్వారీ నిర్వహణ బాధ్యతలను ఇసుక మాఫియూకే అప్పగిస్తున్నారా... అధికారులే ఈ దందా నడిపిస్తున్నారా... అంటే అవుననే సమాధానమే వస్తోంది.  ఏటూరు వద్ద ఏర్పాటు కానున్న ఇసుక క్వారీ వ్యవహారంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న తతంగమే ఇందుకు ఉదాహరణగా  నిలుస్తోంది.  రాష్ట్రంలో ఇసుక కొరత తీర్చేందుకు ప్రభుత్వం కొత్త పాలసీ అమల్లోకి తీసుకువచ్చింది. అధికారుల కనుసన్నల్లోనే ఇసుక స్టాక్ యార్డులను ఏర్పాటు చేసి తక్కువ ధరలకు విక్రయించాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఏటూరునాగారం మండలం ఏటూరు గ్రామపంచాయతీ సమీపంలోని గోదావరిలో క్వారీ నిర్వహించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. కంతనపల్లి బ్యారెజ్ నిర్మాణ స్థలం నుంచి తుపాకులగూడెం వరకు గోదావరిలో రూ. 1.20 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడేందుకు అనుమతించాలని జిల్లా స్థాయి సమావేశంలో తీర్మానించారు. దీని నిర్వహణ బాధ్యతను అక్కడి గ్రామ పంచాయతీకే అప్పగించాలని కలెక్టర్ కరుణ ఆదేశించారు. పెద్ద మొత్తంలో ఇసుక క్వారీకి అనుమతి వస్తున్నందని భావించిన దళారులు రంగప్రవేశం చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అధికారులే ముందు ఉండి ఇసుక క్వారీలను ప్రైవేటు పరం చేసేందుకు వ్యూహం పన్నారు.

రాష్ట్ర స్థాయిలో ఆదేశాలు..!

ఏటూరునాగారం మండలంలోని ఏటూరు వద్ద ఏర్పాటు కానున్న ఇసుక క్వారీ నిర్వహణ ఎవరికి అప్పగించాలన్న ఆదేశాలు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా అధికారులకు వస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నేతలు, అధికారుల డెరైక్షన్లతోనే ఇక్కడి అధికారులు ఉరుకులు... పరుగుల మీద చర్యలు చేపడుతున్నారు. పక్క జిల్లాలో టెండర్ల నిర్వహణకు పది రోజుల సమయం ఇచ్చిన అధికారులు... జిల్లాలో మాత్రం ఆఖరు రోజున  టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు అదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఎలాంటి డిపాజిట్ లేకుండా కేవలం లెటర్‌హెడ్‌లపై టెండర్లు వేయడాన్ని పలువురు అక్షేపించారు. దీంతో టెండర్లు మరో రెండు రోజులపాటు తీసుకుంటామని బుధవారం ప్రకటించిన అధికారులు... గురువారం సాయంత్రం టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియాలో వస్తున్న కథనాలకు ఎన్‌ఎండీసీ ఎండీ ప్రకటనలు ఇవ్వడంతో ఈవ్యవహారం రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నదానికి నిదర్శనమని పలువురు భావిస్తున్నారు.
 
సొసైటీ పేరిట దళారులకు అప్పగింత...

క్వారీ కోసం పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో అక్కడి గ్రామ సంఘానికే ఇసుక క్వారీ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని కలెక్టర్ గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో పాటు అధికారులను ఆదేశించారు. సొసైటీకి యంత్రాలు పెట్టుకునే స్థోమత లేనందున గోదావరిలో ఇసుక తోడేందుకు టెండర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఎన్‌ఎండీసీ ఎండీ మీడియాకు వెల్లడించారు. పొరుగు జిల్లాల్లో ఇసుక తోడేందుకు టెండర్లు నిర్వహించిన అధికారులు... ఇక్కడ ఎందుకు నిర్వహించడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు రద్దు చేస్తామని అధికారులు ప్రకటించిన 24 గంటల్లోపే ఏటూరు వద్ద గల గోదావరిలో రెండు ప్రొక్లైనర్లు ప్రత్యక్షం కావడంతో అధికారులే ముందు ఉండి నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పేర్లు లేక పోవడంపై ఆగ్రహం

ఏటూరు పరిధిలో క్వారీ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ లిమిటెడ్ పేరిట రిజిస్టర్ అయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. అంతా సీక్రెట్‌గా జరిగినట్లు తెలిసింది. గ్రామంలో వేసిన సోసైటీ కమిటీలో గ్రామాలకు చెందిన సభ్యులు ఉండగా... రిజిస్ట్రేషన్ సమయంలో జిల్లా సహకార అధికారి వద్ద దాఖలైన దరఖాస్తుల్లో ఇతరుల పేర్లు చేర్చినట్లు  సమాచారం. ఈ విషయం తెలిసిన ఏటూరు, సింగారం, కంతనపెల్లి గ్రామాలకు చెందిన ప్రజలు శుక్రవారం క్వారీ నిర్వహణ కోసం అధికారులు చేస్తున్న పనులను అడ్డుకున్నారు. దీంతో గోదావరిలో ఇసుక తోడేందుకు తీసుకువచ్చిన రెండు ప్రొక్లైనర్లను (డైవర్లు పక్కనబెట్టి విశ్రాంతి తీసుకున్నారు. అసలు ఈ క్వారీ సొసైటీ నిర్వహిస్తోందా.... వారి పేరిట ఇతరులకు అప్పగించారన్న విషయాలు ఇసుక తోడడం ప్రారంభిస్తే తప్పా.. తెలిసే అవకాశం లేదు.
 
స్టాక్ యార్డ్ ఏర్పాటు...

టెండర్లు నిర్వహించకుండాన సొసైటీకి అధికారికంగా అప్పగించినట్లు ప్రకటించక ముందే... ఏటూరు గ్రామ సమీపంలో 34 ఎకరాల్లో స్టాక్‌యార్డును శుక్రవారం అధికారులు ఏర్పాటు చేశారు. ఎకరాకు ఏడాదికి రూ.20 వేల చొప్పున కౌలు ఇచ్చే విధంగా అధికారులే సొసైటీ పేరిట నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. సొసైటీలో పేర్ల లేవన్న కారణంగా స్టాక్‌యార్డు పనులను గ్రామ ప్రజలు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు.

సొసైటీ రిజిస్ట్రేషన్ అయింది...

ఏటూరు గ్రామ ప్రజల ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ లిమిటెడ్ పేరిట నమోదైందని జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి తెలిపారు. ఈ సొసైటీకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగిందని ‘సాక్షి’ వివరణ కోరగా... తటపటాయిస్తూ 15రోజుల కిందట జరిగిందని సమాధానమిచ్చారు. జిల్లాలో ఈనెల 11 నుంచి శాసన మండలి ఎన్నికల నియమావళి అమలులో ఉంది. ఎప్పుడు సొసైటీ రిజిస్టర్ అయిందో... అధికారులు దీనికి ఎప్పుడు అనుమతి ఇచ్చారనే అంశాల్లో అంతా అస్పష్టత నెలకొంది. ఇదంతా చూస్తుంటే భారీ మొత్తంలో నగదు చేతులు మారినందునే హడావుడిగా క్వారీని ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు