అదే జట్టు.. ఐదో బడ్జెట్టు 

16 Mar, 2018 03:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా అయిదోసారి రాష్ట్ర బడ్జెట్‌ తయారీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి రామకృష్ణారావు కీలక భూమిక నిర్వర్తించారు. తొలి రెండేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శి (ఐఎఫ్‌) హోదాలో బడ్జెట్‌ రూపకల్పన చేసిన రామకృష్ణారావు రెండేళ్లుగా అదే శాఖలో ముఖ్య కార్యదర్శిగా పదోన్నతి పొందారు. బడ్జెట్‌ తయారీలో ఆర్థిక శాఖతోపాటు కీలక పాత్ర పోషించే ప్రణాళిక శాఖకు సైతం ఆయనే పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈసారి బడ్జెట్‌ తయారీలో రామకృష్ణారావు రేయింబవళ్లు శ్రమించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశంతో వరుసగా అయిదు బడ్జెట్‌ల తయారీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించటం విశేషం.

సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌ కావటంతో, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయత్నించటంతో పాటు ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతలను సమపాళ్లలో పొందుపరిచేందుకు భారీగా కసరత్తు చేయాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక సలహాదారులు జీఆర్‌ రెడ్డి, ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి బడ్జెట్‌తో పాటు సామాజిక ఆర్థిక సర్వేను తయారు చేయటంలో ప్రధాన భూమిక నిర్వహించారు. బడ్జెట్‌ తయారీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యధిక సమయం వెచ్చించటంతో పాటు ప్రతి పద్దును స్వయంగా పరిశీలించారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్ని శాఖలతో బడ్జెట్‌ ప్రతిపాదనలను సమీక్షించటంతో పాటు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్‌ నుంచి ఇదే జట్టు వరుసగా బడ్జెట్‌ రూపకల్పన కసరత్తును నిర్వహించటం విశేషం.  

ఉపాధి కల్పన, కార్మికశాఖకు తక్కువే..
కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు కేటాయింపులు భారీగా తగ్గాయి. గతేడాది ఈ శాఖకు రూ. 625.58 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 596.32 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ. 332.40 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 263.92 కోట్లు కేటాయించింది. ఈ శాఖ ప్రస్తుతం ఎంప్లాయిమెంట్‌ కార్డుల పునరుద్ధరణతో పాటు ఐటీఐ ప్రవేశాలు తదితరాల్లో ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా పలు ఐటీఐలను కార్పొరేట్‌ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుని ఉద్యోగావకాశాల కల్పనను వేగవంతం చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో కేటాయింపులు తగ్గడంతో ఆ శాఖ కార్యక్రమాలపై ప్రభావం పడనుంది.  

మహిళా, శిశు సంక్షేమానికి దక్కని ప్రాధాన్యత
మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి తాజా బడ్జెట్‌లో ప్రాధాన్యత అంతంత మాత్రంగానే దక్కింది. గతేడాది రూ. 1,731.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ. 1,798.82 కోట్లు ఇచ్చింది. కొత్త పథకాలు లేనప్పటికీ ప్రగతి పద్దు భారీగా పెరిగినా ఈ శాఖకు ప్రాధాన్యత దక్కలేదు. తాజా బడ్జెట్‌లో నిర్వహణ పద్దు కింద రూ. 859.43 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 939.39 కోట్ల చొప్పున ఇచ్చింది. ఈసారి బడ్జెట్‌లో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థకు రూ. 70.14కోట్లు కేటాయించింది. గతేడాది రూ.6 కోట్లు మాత్రమే ఇవ్వగా ఈసారి భారీగా పెంచడంతో మహిళలకు ఆర్థిక చేయూత కార్యక్రమాలకు ఊతమిచ్చినట్లయింది. పౌష్టికాహార పథకాలకు రూ. 240.95 కోట్లు, సబల కార్యక్రమానికి రూ. 34.68 కోట్లు, ఆరోగ్యలక్ష్మికి రూ. 153.79 కోట్లు కేటాయించింది. 

మరిన్ని వార్తలు