భద్రాద్రిలో మద్యం వద్దే వద్దు..!

10 Jul, 2014 03:17 IST|Sakshi
భద్రాద్రిలో మద్యం వద్దే వద్దు..!

భద్రాచలం: పుణ్య క్షేత్రమైన భద్రాచలంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ గ్రామ సభ తీర్మానించింది. పట్టణంలోని అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్) కాలనీలో బుధవారం ఏర్పాటైన గ్రామసభకు మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. మద్యం షాపులు వద్దంటే వద్దంటూ ఏకోన్ముఖంగా గళం విప్పారు. ఇక్కడి మహిళల్లోని చైతన్యాన్ని చూసి ఎక్సైజ్ అధికారులు విస్తుపోయారు. భద్రాచలం పట్టణంలో తొమ్మిది మద్యం దుకాణాల ఏర్పాటుకు టెండర్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. వీటిని గిరిజనులకు ఇప్పటికే లాటరీ పద్ధతిలో కేటాయించారు. కానీ, పీసా చట్టం ప్రకారంగా మద్యం దుకాణాల ఏర్పాటుకు గ్రామసభల ఆమోదం తప్పనిసరి. లేనట్టయితే లెసైన్స్ ఇవ్వరు.

దీంతో, ప్రజాభిప్రాయ సేకరణ కోసం గిరిజనులు ఎక్కువగా ఉన్న నాలుగు కాలనీలను అధికారులు గుర్తించి గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏఎస్‌ఆర్ కాలనీలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ భూక్యా శ్వేత అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో ఎక్సైజ్ సీఐ రాంకిషన్, ఎస్సై రాధ, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెం డెంట్ ప్రసాద్‌రాజు, పంచాయతీ ఇంచార్జి ఈవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామసభ ఏర్పాటు కారణాలను సర్పంచ్ శ్వేత వివరించారు.  ఈ గ్రామ సభకు మొత్తం 154 మంది హాజరయ్యారు. మద్యం షాపుల ఏర్పాటుకు అనుకూలంగా 29 మంది, వ్యతిరేకంగా 125 మంది నిర్ణయం ప్రకటించారు. సభకు హాజరైన వారిలో మహిళలే ఎక్కువమంది ఉన్నారు. ఈ గ్రామసభ నిర్ణయాన్ని నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు తెలుపుతానని ఎంపీడీవో సూపరింటెం డెంట్ ప్రసాదరాజు అన్నారు.

ఫలించని సిండికేట్ వ్యూహం
ఇప్పటికే రాజుపేటలో నిర్వహించిన గ్రామసభలో (మద్యం దుకాణాల ఏర్పాటుకు) వ్యతి రేకత రావటం, సుందరయ్య నగర్ కాలనీ లోని సభలో స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవటంతో, ఏఎస్‌ఆర్ కాలనీలో నిర్వహిం చిన గ్రామసభకు కోరం వచ్చే రీతిలో జనాన్ని తరలించేందుకు మద్యం బినామీ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వ్యూహం పన్నారు. దుకాణాల ఏర్పాటుకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాలంటూ కాలనీలోని కొందరికి డబ్బు ఎరగా చూపారు. దీనిని మహిళలు వ్యతిరేకించారు. అంతేకాదు.. గ్రామసభకు కూడా స్వచ్ఛందగా తరలివచ్చి, మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్ణయం ప్రకటించారు.

మరిన్ని వార్తలు