టీఆర్‌ఎస్‌ అరాచకాలను ఎండగట్టండి

29 Oct, 2018 02:58 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులకు భట్టి విక్రమార్క సూచన

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ అరాచకాలు, నియంతృత్వ పోకడలను ప్రజల్లో ఎండగట్టాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క పార్టీ అధికార ప్రతినిధులకు సూచించారు. ప్రజల్లో అధికార టీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని, రాబోయే ఎన్నికల్లో వారు టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని అశోక హోటల్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల చైర్మన్లతో జరిగిన సదస్సులో ఆయన  పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో పార్టీ అధికార ప్రతినిధుల పాత్ర చాలా కీలకమైనదని భట్టి పేర్కొన్నారు. అధికార ప్రతినిధులు ఎంత బాగా పనిచేస్తే పార్టీ అంత బలంగా ఉంటుందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి సానుకూల స్పందన వచ్చేలా చేయాలని వారికి సూచించారు. అన్ని అంశాల్లో సమగ్రంగా, లోతు గా అధ్యయనం చేసు కోవాలని, అధికార ప్రతినిధుల అభిప్రాయాలనే పార్టీ విధానాలుగా భావించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజల నాడిని బట్టి నడుచుకున్నప్పుడే మంచి స్పందన లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు కార్యాలయాలకు పరిమితం కాకూడదని ప్రజల్లో ఉంటేనే స్థితిగతులు అర్థం అవుతాయన్నారు. ఈ సదస్సులో అధికార ప్రతినిధులతో బృంద చర్చలు, అంశాల వారీగా అధ్యయనాలు నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ æప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ వార్‌ రూమ్‌ ప్రతినిధి మేహర్, ఏఐసీసీ మీడియా ఇన్‌చార్జి ప్రశాంత్, ప్రముఖ పాత్రికేయులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు