ఉద్రిక్తతల మధ్య కండక్టర్‌ అంతిమయాత్ర

4 Nov, 2019 05:21 IST|Sakshi
ఆత్మకూరులో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరుగుతున్న దృశ్యం

ఎమ్మెల్యే ధర్మారెడ్డిని ఘెరావ్‌ చేసిన కార్మికులు

మహిళా కండక్టర్‌పై చేయిచేసుకున్న సీఐ

ఆత్మకూరులో ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులు

ఆత్మకూరు: ఆర్టీసీ కండక్టర్‌ ఏరుకొండ రవీందర్‌ అంతిమయాత్ర ఆదివారం ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కండక్టర్‌ ఏరుకొండ రవీందర్‌ (52) గురువారం టీవీ చూస్తూ గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హన్మకొండకు తరలించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ శనివా రం అర్ధరాత్రి తర్వాత మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు ఆదివారం ఉద యమే పెద్ద ఎత్తున ఆత్మకూరుకు చేరుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ఊరుకునేది లేదని జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులను పలుమార్లు అదుపులోకి తీసుకుని వదిలేశారు.

కాగా, రవీందర్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి వెళుతున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కార్మికులు ఘెరావ్‌ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మృతుడు రవీందర్‌ కుటుంబానికి డబుల్‌ బెడ్రూం ఇల్లు, ఎక్స్‌ గ్రేషియా మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రవీందర్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్టీసీ ఆస్తులపై కన్ను పడిందని, కావాలనే కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఏపీ ముఖ్యమంత్రిని ఫాలో కాకున్నా.. నిజాంను ఫాలో కావాలన్నారు. నిజాం హయాంలో ఆర్టీసీ ప్రభుత్వంలోనే ఉందని గుర్తుచేశారు.

మహిళా కండక్టర్‌పై చేయిచేసుకున్న సీఐ
కండక్టర్‌ రవీందర్‌ అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో వీఆర్‌లో ఉన్న సీఐ మధు మహిళా కండక్టర్‌ భవానీపై చేయిచేసుకోవడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు మళ్లీ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. కార్మికులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో భవాని రోడ్డుపై పడిపోవడంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. సీఐ మధు తమకు క్షమాపణ చెప్పే వరకూ కదిలేది లేదని కార్మికులు భీష్మించారు. దీంతో డీసీపీ నాగరాజు, ఏసీపీ శ్రీనివాస్‌ కార్మికులతో మాట్లా డి శాంతింపచేశారు. సీఐపై చర్య తీసుకుంటా మనడంతో వారు ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు