కేంద్ర మంత్రి రేసులో చామకూర, తూళ్ల!

20 May, 2014 22:51 IST|Sakshi

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల ఘట్టం ముగియడంతో ఇప్పుడు మంత్రి పదవులపై చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి వర్గంలో జిల్లా నేతకు చోటుదక్కనుందని రాజకీయ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కేవలం ఒకేఒక్క ఎంపీ సీటు గెలుచుకుంది. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి విజయం సాధిం చారు. కూటమిలోని భాగస్వాములకు మంత్రివర్గంలో చోటిస్తామని బీజేపీ పేర్కొనడంతో అందరిచూపు జిల్లావైపు మళ్లింది. ఎంపీగా గెలుపొందిన చామకూర మల్లారెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
 
 సీనియరా.. జూనియరా?
కేంద్ర మంత్రి పదవి అంటే ఆషామాషీ కాదు. అందుకు కొంతైనా రాజకీయ అనుభవం కావాలి. అయితే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన మల్లారెడ్డి రాజకీయాలకు కొత్త. ఎన్నికల సమయంలో రాజకీయ ఆరంగ్రేటం చేసిన ఆయ న.. అనూహ్యంగా ఎంపీ గా గెలి చారు. రాజకీయాలకు కొత్త అయిన ఆయనకు మంత్రి పదవి కట్టబెడతారా.. లేక సీనియర్ నేతకు ప్రాధాన్యం ఇస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
 
జిల్లా నుంచి టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా తూళ్ల దేవేందర్‌గౌడ్ ఉన్నారు. అపార రాజకీయ అనుభవం ఉన్న నేతగా పేరున్న దేవేందర్ రాష్ట్రంలో కీలక మంత్రి పదవుల్లో పనిచేశారు. కేవలం జిల్లాలోనే కాకుండా తెలంగాణలో ప్రముఖ నేతగా ఉన్న దేవేందర్‌గౌడ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షనేతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియార్టీని పరిగణలోకి తీసుకుంటే మల్లారెడ్డికి బదులుగా దేవేందర్‌కు పేరు పరిశీలించే అవకాశం ఉంది. అయితే దేవేందర్‌గౌడ్ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

>
మరిన్ని వార్తలు