ముదురుతున్న ‘పంచాయితీ’

26 May, 2014 23:44 IST|Sakshi
ముదురుతున్న ‘పంచాయితీ’

 చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శుల మధ్య ముదిరిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. వివాదం ముదిరి పెద్దదయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ‘రచ్చ’ బజారున పడింది. దీంతో ఎమ్మెల్యే కాలె యాదయ్య వద్దకు పంచాయితీ చేరింది. ఈ విషయం మరీ పెద్దదవుతుందన్న ఉద్దేశంతో విలేకరులను బయటకు పంపి సోమవారం స్థానిక అతిథిగృహంలో అధికారులు, ఈఓపీఆర్డీ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు.
 
 పంచాయతీ ఎటూ తేలకపోవడంతో ఎమ్మెల్యే యాదయ్య సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు నచ్చజెప్పి పంపించారు. వివరాల్లోకి వెళితే... ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎంపీడీఓగా హిమబిందు బదిలీపై వచ్చారు. అంతకుముందు ఎంపీడీఓగా పనిచేసిన రత్నమ్మకు ఇప్పుడున్న సూపరిండెంట్ విజయలక్ష్మికి మధ్య సయోధ్య ఉండేదికాదు. కొత్తగా వచ్చిన ఎంపీడీఓ హిమబిందు కలిసి ఈఓపీఆర్డీ లక్ష్మణ్‌ను, పంచాయతీ కార్యదర్శులపట్ల అసభ్యకరంగా మాట్లాడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈఓపీఆర్డీ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శులు ఏదైనా పనిపై వారి వద్దకు వెళితే అవమానపరిచే రీతిలో మాట్లాడేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలో డీపీఓ కార్యాలయం నుంచి ఆరు కంప్యూటర్లు పంపిణీ అయ్యాయి. ఒకటి ఈఓపీఆర్డీకి, ఐదు పలు గ్రామపంచాయతీలకు పంపిణీ చేయాలి. కాగా పంచాయతీలకు పంపిణీ చేయగా, ఈఓపీఆర్డీకి వచ్చిన కంప్యూటర్‌ను ఎంపీడీఓ చాంబర్‌లో బిగించాలని సూచించడంతో ఈఓపీఆర్డీ లక్ష్మణ్ అభ్యంతరం చెప్పారు. దీంతో వివాదం మరింత ముదిరింది.
 
 ఈఓపీఆర్డీ ఆఫీసుకు తాళం..
 తనకు కేటాయించిన కంప్యూటర్‌ను ఎంపీడీఓ చాంబర్‌లో బిగించాలని ఎంపీడీఓ హిమబిందు ఆదేశించడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. దీంతో మెమో జారీ చేయగా, తన తప్పేమీ లేదని, మెమో ఎందుకు తీసుకోవాలంటూ ఈఓపీఆర్డీ లక్ష్మణ్ నిరాకరించారు.
 
ఎమ్మెల్యే ముందుకు పంచాయితీ..
ఎమ్మెల్యే కాలె యాదయ్యకు అభినందనలు తెలపడానికి వచ్చిన ఈఓపీఆర్డీ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓ, సూపరిండెంట్ తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆయన ఫోన్‌చేసి అతిథిగృహానికి రావాలని ఆదేశించడంతో ఎంపీడీఓ హిమబిందు, సూపరిండెంట్ విజయలక్ష్మి వచ్చారు. అందరూ కలిసిమెలిసి పనిచేయాలని, తగవులు పెట్టుకుంటే ప్రజా సంక్షేమం కుంటుపడుతుందని ఆయన హెచ్చరించి పంపించేశారు.
 
విలేకరులను బయటకు పంపి..
మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి విలేకరులను బయటకు పంపి, అధికారుల మధ్య పంచాయితీ చెప్పారు. ఓ విలేకరి ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా, ముడిమ్యాల మాజీ సర్పంచ్ ప్రభాకర్ చేతిని అడ్డంపెట్టి గన్‌మెన్‌తో తలుపులు వేయించారు. విలేకరులను బయటకు వెళ్లాలని చెప్పినప్పుడు ఎమ్మెల్యే యాదయ్య అక్కడే ఉండి వంత పాడడం విశేషం.

మరిన్ని వార్తలు