ఖాకీల ఫైట్‌..!

22 Nov, 2018 14:07 IST|Sakshi

ఠాణాలో పోలీసుల బాహాబాహి

స్పెషల్‌ పోలీస్‌పై ఎస్సై వీరంగం

ఆలస్యంగా వెలుగులోకి.. 

సాక్షి, పెద్దపల్లి: శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే బాహాబాహీకి దిగారు. పోలీసు స్టేషన్‌ ఆవరణలోనే బూతులు తిట్టుకొంటూ పరస్పరం దాడి చేసుకున్నారు. తన పోలీసుస్టేషన్‌లో తనదే రాజ్యమంటూ ఓ ఎస్సై సహచర హెడ్‌కానిస్టేబుల్‌తో కలిసి స్పెషల్‌ పోలీసులపై వీరంగం సృష్టించారు. జిల్లాలోని ఓ మారుమూల పోలీసుస్టేషన్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

ఠాణాలోనే తిట్ల దండకం..
జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని ఓ పోలీసు స్టేషన్‌లో ఎస్సై, స్పెషల్‌ పోలీసుల నడుమ జరిగిన గొడవ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఎస్సై, ఓ హెడ్‌కానిస్టేబుల్‌ మధ్య మొదలైన వాగ్వాదం, చివరకు అదే పోలీసుస్టేషన్‌కు ఎన్నికల బందోబస్తు నిమిత్తం వచ్చిన స్పెషల్‌ పోలీసులకు పాకినట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం రాత్రివేళ పోలీసుస్టేషన్‌లో ఎస్సైతోపాటు ఆయనకు సన్నిహితంగా ఉండే ఓహెడ్‌కానిస్టేబుల్‌ మధ్య వాగ్వాదం మొదలైంది. కుటుంబపరంగా కూడా కలిసుండే ఇద్దరి మధ్య మామూళ్ల వ్యవహారంతో విభేదాలు పొడచూపినట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సై దురుసు వ్యవహారంపై ఇటీవల సీఐకి ఫిర్యాదు అందింది.

ఆయన వెంటనే ఎస్సైని మందలించారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. తాజా గొడవ, సీఐకి అందిన ఫిర్యాదు విషయాన్ని మనసులో పెట్టుకొన్న ఎస్సై దీనికి స్టేషన్‌లోనే ఉంటున్న స్పెషల్‌ పోలీసులే కారణమంటూ వారిని దుర్భాషలాడారు. వారు కూడా ఎస్సై తీరుపై అసహనానికి గురయ్యారు. మాటకు మాట సమాధానం చెప్పడంతో సహనం కోల్పోయిన ఎస్సై వారిపై చేయి కూడా చేయిచేసుకొన్నట్లు సమాచారం. బూతులు తిడుతూ స్టేషన్‌ ఆవరణలోనే హంగామా సృష్టించారు. దూషణల క్రమంలో సదరు ఎస్సై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అదేరోజు గొడవ సమాచారం అందడంతో పోలీసు ఉన్నతాధికారులు అర్ధరాత్రి పోలీసుస్టేషన్‌ను సందర్శించి ఎస్సైని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. అయితే విషయం బటకు పొక్కితే పరువు పోతుందనే భావనతో చర్యలు తీసుకోకుండా వేచి ఉన్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు