డిప్యూటీ-మాజీ డిప్యూటీ మధ్య రగడ

14 Feb, 2015 00:45 IST|Sakshi
డిప్యూటీ-మాజీ డిప్యూటీ మధ్య రగడ

స్టేషన్‌లో చిచ్చు

డిప్యూటీ-మాజీ డిప్యూటీ మధ్య రగడ
సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో ఆధిపత్య పోరు
అధికారులకుసంకటంగా మారిన పరిస్థితి
 

లింగాలఘణపురం : స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లు తమ వెంట ఉండే ద్వితీయ శ్రేణి నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించే విషయంలో వివాదాలు ఉండేవి. తాజాగా ప్రభుత్వ పథకాలు, పరిపాలన అంశాల్లో కూడా పోరు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి మార్పు తర్వాత తన నియోజకవర్గంలో ఎవరు వేలు పెట్టినా సహించేదిలేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య పదేపదే ప్రకటిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే ఇటీవల సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ లబ్ధిదారుల విషయంలో ఇదే జరిగింది. వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను సన్న, చిన్నకారు రైతులకు అందిస్తోంది. ఇటీవల జిల్లాకు 94 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. వ్యవసాయశాఖలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్, మహబూబాబాద్, మరిపెడ, నర్సంపేట, ములుగు, పరకాల, ఏటూరునాగారం డివిజన్లు ఉన్నాయి. గ్రామీణ మండలాలకు సగటున రెండు చొప్పున కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ట్రాక్టరుపై గరిష్టంగా రూ.5 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. నిబంధనల ప్రకారం.. ఆయా గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి సర్పంచ్, ఎంపీటీసీ.. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తహశీల్దార్, ఎంపీడీవో, ఏవోల ఆమోదంతో సబ్సిడీ పరికరాల పంపిణీ ప్రాధాన్యత కల్పించాలి.
 
మరో ఉదాహరణ

స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని మండలాలకు రెండు చొప్పున ట్రాక్టర్లు కేటాయించారు. తనకు దగ్గరగా ఉండే ఒక రైతుకు సబ్సిడీ ట్రాక్టర్ పంపిణీ అయ్యేలా చూడాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సిఫారసు లేఖ ఇచ్చారు. పథకానికి సంబంధించి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నట్లుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీడీవోలతోనూ సంతకాలు చేసి ఆమోదం తెలిపారు. ఇక రేపోమాపో ట్రాక్టర్ వచ్చేస్తుందనే ధీమాతో దరఖాస్తు చేసుకున్న రైతు ఓ ట్రాక్టర్ కంపెనీ యజమానిని వెంటబెట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. విషయం తెలిసిన మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య ఆగ్రహం ఆ దరఖాస్తును వెనక్కి తీసుకరావాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మధ్య అధికార యంత్రాంగం బిక్కుబిక్కుమంటున్నారు. ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. సబ్సిడీ ట్రాక్టర్లకు సంబంధించి మార్చి 30లోగా లబ్ధిదారుల ఎంపిక చేసి పంపిణీ పూర్తి చేయాలి.

ప్రజాప్రతినిధుల సిఫారసులతో తాము ఏం చేసే పరిస్థితి లేదని వ్యవసాయశాఖ అధికారులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోని రైతులకు కనీసం సమాచారం లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేల పైరవీకారులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయాలని నిర్ణయించిన జాండీర్, సుబోటో, న్యూహోలాండ్, ఎస్కర్ట్ కంపెనీల షోరూం యజమానులకు మాత్రమే ఈ పథకంపై సమాచారం ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఈ సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ కేటాయింపులో సిఫారసులు చేస్తుండడంతో అర్హులైన ఎందరో రైతులకు ప్రభుత్వ పథకాల గురించి సమాచారం తెలియడం లేదు. దీంతో ప్రభుత్వ పథకాల ఉద్దేశం నెరవేరడం లేదు.
 
 

మరిన్ని వార్తలు