విస్తా కాంప్లెక్స్ వద్ద రగడ

30 Jul, 2014 04:09 IST|Sakshi
విస్తా కాంప్లెక్స్ వద్ద రగడ

భద్రాచలం టౌన్:  భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి చెందిన విస్తా కాంప్లెక్స్‌లో దుకాణాల వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విస్తాకాంప్లెక్స్‌లో బొమ్మల దుకాణాలు నిర్వహిస్తున్న వారి నుంచి లక్షల రూపాయలలో అద్దె బకాయిలు పడటంతో వాటిని వసూలు చేసేందుకు రామాలయ సిబ్బంది వెళ్లారు. వ్యాపారాలు సరిగా లేక బకాయిలు పడ్డామని, గడువు ఇస్తే వాటిని చెల్లిస్తామంటూ దుకాణదారులు వాగ్వాదానికి దిగారు. 24 నెలలు నుంచి అద్దెలు కట్టని వారు ఉన్నారని, ఇక ఉపేక్షించేది లేదంటూ సిబ్బంది పట్టుబట్టారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
 
 విస్తా కాంప్లెక్సుల అద్దె బకాయిలు రూ.16.50 లక్షలు

భద్రాచలం దేవస్థానానికి సంబంధించిన అన్ని దుకాణాలు, పాటదారులు మొత్తం రూ.78 లక్షలు బకాయి ఉన్నారు. వీటిలో విస్తా కాంప్లెక్స్‌లోనే పది నెలలుకు పైగా అద్దె కట్టనివారి బకాయిలే రూ.16.50 లక్షలు ఉన్నాయంటూ దేవస్థాన సూపరింటెండెంట్ భవాని రామకృష్ణ తన సిబ్బందితో, దేవస్థానం పోలీసు సిబ్బందితో విస్తా కాంప్లెక్స్‌కు వచ్చారు. పది నెలలకు పైగా బకాయిలు ఉన్న వారి దుకాణాలకు తాళాలు వేయాలంటూ సిబ్బందిని ఆదేశించారు. వారిని విస్తా కాంప్లెక్స్ దుకాణదారులు అడ్డుకున్నారు.
 
గత కొద్ది నెలలుగా వ్యాపారాలు లేవని, వినాయక చవితి నిమజ్జనం వరకు గడువు ఇవ్వాలని కోరారు. కొన్ని నెలలుగా అద్దె కట్టని వారి జోలికి వెళ్లమని, పది నెలలుకు పైగా బాకీలు పడ్డవారి దుకాణాలకే తాళాలు వేస్తామని ఆలయ సిబ్బంది స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, దుకాణదారులు దేవస్థాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అద్దెలను చెల్లించాలంటూ తమ సిబ్బంది కోరుతూనే ఉన్నారని,  అయినా నిర్లక్ష్యంగా ఉంటూ అద్దెలను చెల్లించలేదని ఆలయ సూపరింటెండెంట్ రామకృష్ణ ఆగ్రహించారు. ఈవో నుంచి ఆదేశాల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని, గడువు కోసం ఈవోను సంప్రదించాలని సిబ్బంది చెప్పారు.
 
ఆలయ ఈవోల వ్యవహార శైలితోనే నష్టం
ఆలయ ఈవోల వ్యవహార శైలి కారణంగానే తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని దుకాణదారులు విలేకరులతో చెప్పారు. పాత తూర్పు మెట్లు ఉన్నప్పుడు వ్యాపారాలు బాగానే ఉన్నాయని, ఈవో ఆజాద్ కాలంలో ఈ మెట్లను తొలగించి పునర్నించినప్పట నుంచి వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్ల స్వరూపాన్ని మార్చాలని, కనీసం లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేసినా భక్తుల తాకిడి ఉంటుందని ఈవో రఘునాధ్‌కు విన్నవించినట్టు చెప్పారు.
 
అప్పటి నుంచి ఈవోలు అందరూ లడ్డూ కౌంటర్లు, మెట్ల నిర్మాణాన్ని చేపడతామని హామీలు ఇస్తున్నారేగానీ పని జరగటం లేదని, తమ వ్యాపారాలు నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేసి వ్యాపారాన్ని పెంచేందుకు ఆలయ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం, కొంతమంది వ్యాపారులు తమ అద్దెలను సిబ్బందికి చెల్లించారు. మరికొంతమంది ఆలయ ఈవోకు విన్నవించుకునేందుకు సిద్ధమయ్యారు.
 
పత్తా లేని ఉన్నతాధికారులు
ఆలయ సిబ్బందితో దుకాణదారులు వాగ్వాదానికి దిగి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నప్పటికీ దేవస్థానం ఉన్నతాధికారులు ఆ దరిదాపులకు కూడా రాలేదు. ఈవో టి.రమేష్‌బాబు భద్రాచలంలో లేకపోవటంతో ఆలయ ఏఈవో శ్రవణ్‌కుమార్‌గారీ, ఆలయ ప్రత్యేకాధికారిణి రత్నప్రభగానీ పర్యవేక్షించాల్సుంది. వీరిద్దరూ, ఆందోళన సమయంలో దేవస్థాన కార్యాలయంలోనే ఉన్నారు. అయినప్పటికీ ఘటన స్థలం వైపు కన్నెతి చూడకపోవటం గమనార్హం.

మరిన్ని వార్తలు