ఉద్యోగాల రగడ

25 Mar, 2015 01:37 IST|Sakshi
మంగళవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి

ఖాళీల భర్తీపై అసెంబ్లీలో సర్కారును నిలదీసిన విపక్షాలు
  రాజకీయ పదవులపై చూపిన శ్రద్ధ.. ఉద్యోగాలపై లేదని మండిపాటు
నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టు
కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దంటూ హితవు
 విపక్షాలవి మొసలి కన్నీరంటూ మంత్రులు ఈటెల, హరీశ్ ఎదురుదాడి
 సీఎం చెప్పినట్లు లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడి
 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ
 మంత్రుల సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు
 నిరసనగా కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం వాకౌట్
 రెండున్నర గంటలపాటు దద్దరిల్లిన సభ

 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై శాసనసభ మంగళవారం అట్టుడికింది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో ఇప్పటికీ ఉద్యోగాల భర్తీని చేపట్టకపోవడంపై సర్కారును విపక్షాలు గట్టిగా నిలదీశాయి. నియామకాలు ఎప్పుడు, ఎలా, ఎన్ని భర్తీ చేస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ పట్టుబట్టాయి. రాజకీయ పదవులను మాత్రం వేగంగా భర్తీ చే స్తున్న ప్రభుత్వం.. ఉద్యోగ ఖాళీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని కూడా ప్రస్తావించి సభను హోరెత్తించాయి. అయితే విపక్షాల దాడికి అధికారపక్షం దీటుగానే బదులిచ్చింది. ఉద్యోగ భర్తీల విషయంలో విపక్షాలన్నీ మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఎదురు దాడికి దిగింది. విభజన అడ్డంకులను అధిగమిస్తూ ప్రభుత్వం ముందుకు కదులుతోందని, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు ప్రకటించారు. మంత్రుల సమాధానానికి సంతృప్తి చెందని కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీల సభ్యులు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. మొత్తానికి ఉద్యోగాల అంశంపై దాదాపు రెండున్నర గంటలపాటు శాసనసభ దద్దరిల్లింది. మంగళవారం ఉదయం సభ మొదలవగానే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు, కేటగిరీవారీగా వివరాలు, వాటి భర్తీకి తీసుకుంటున్న చర్యలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అన్ని పార్టీల నుంచి 27 మంది సభ్యులు ఒకే ప్రశ్నగా అడిగారు. దీనికి ఆర్థిక మంత్రి ఈటెల మొదట సమాధానమిచ్చారు. అనంతరం మిగతా సభ్యులందరూ దీనిపై తలో ప్రశ్న వేయడంతో సభ రెండున్నర గంటల పాటు ఇదే అంశంపై నడిచింది. దీంతో మిగతా ప్రశ్నలను స్పీకర్ వాయిదా వేశారు.

 ఉద్యోగుల భర్తీ ఎప్పుడు?: కాంగ్రెస్
 ఉద్యోగాల కోసం 25 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది. పాఠశాలల్లో 25 వేల పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని సభ దృష్టికి తెచ్చింది. పార్టీ తరఫున ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, సభ్యులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి మాట్లాడారు. ‘ఉద్యోగ భర్తీపై ఏమీ చెప్పకుండా గత ప్రభుత్వాలపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూడటం సమంజసం కాదు. నియామకాలు ఎప్పుడు, ఎంత వ్యవధిలో, ఎలా చేస్తారో స్పష్టతనివ్వాలి. కమలనాథన్ కమిటీతో సంబంధం లేని 85 శాతం పోస్టుల్లో సుమారు 90 వేల ఖాళీలను భర్తీ చేసే అవకాశముంది. వీటిని ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పండి’ అని జానారెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామన్నారు.

 దాటివేత ధోరణి: బీజేపీ
 ‘ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ఖాళీలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం భర్తీపై స్పష్టతనివ్వడం లేదు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల భర్తీని కూడా కమల్‌నాథన్ కమిటీతో ముడిపెడుతున్నారు. ఇది మోకాలుకు, బోడిగుండుకు ముడిపెట్టడమే. కాంట్రాక్టు ఉద్యోగులను ఎంతమందిని క్రమబద్ధీకరిస్తారో చెప్పండి’ అని బీజేపీపక్ష నేత కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

 ఎంతమందో తేల్చండి: ఎంఐఎం
 నియామకాలు చేపట్టే ముందు శాఖలవారీగా ఎంత మంది ఉద్యోగులు అవసరమో తేల్చాలని సర్కారుకు ఎంఐఎం సూచించింది. ఆ పార్టీ తరఫున అక్బరుద్దీన్ మాట్లాడారు. ఉద్యోగ ఖాళీలకు నిర్వహించే పరీక్షలను ఉర్దూలో నిర్వహిస్తారా? ఈ నియామకాల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తారా అన్నది స్పష్టంగా తెలపాలని డిమాండ్ చేశారు.

 క్రమబద్ధీకరణ ఎప్పుడు?: లెఫ్ట్
 కాంట్రాక్టు ఉద్యోగులను ఎప్పటిలోగా క్రమబద్ధీకరణ చేస్తారని సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఆ పార్టీల నేతలు రవీంద్రకుమార్, సున్నం రాజయ్య ఈ విషయాన్ని ప్రస్తావించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం వద్ద ఉన్న ప్రస్తుత లెక్కల ప్రకారం ఖాళీలను భ ర్తీ చేయాలని కోరారు.
 
 నిరంతర ప్రక్రియగా ఉద్యోగాల భర్తీ: ఈటెల
 
 ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ సమాధానమిచ్చారు. ‘కమల్‌నాథన్ కమిటీతో సంబంధం లేకుండా 85 శాతం ఉద్యోగ ఖాళీలు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీని ఏర్పాటు చేశాం. గతంలో ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయి. మళ్లీ అలా జరగకుండా నియామకాలను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇకపై నిరంతర ప్రక్రియలా ఉద్యోగాల భర్తీని చేపడతాం’ అని మంత్రి పేర్కొన్నారు. నియామకాలన్నీ ప్రస్తుతమున్న రిజర్వేషన్ మేరకే జరుగుతాయన్నారు. ఏడాదిలో లక్ష  ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం ఇచ్చిన హామీ మేరకు నియామకాలు జరుపుతామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు చర్యలు మొదలుపెట్టామని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నియామక పరీక్షలన్నీ ఉర్దూలోనూ ఉండేలా చూస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా