నిండిన జలాశయాలు

9 Sep, 2014 00:42 IST|Sakshi
నిండిన జలాశయాలు

కడెం : ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల్లో మండలంలో వేలాది ఎకరాలు బీడుగా మారాయి. కొందరు రైతులు మొండి ధైర్యంతో వరి నార్లు పోయగా అవి ఎండలకు ఎండిపోయాయి. ఇదీ.. మొన్నటి వరకు కడెం ప్రాజెక్టు, సదర్‌మాట్ ఆయకట్టుల కింద ఉన్న పరిస్థితి. ప్రస్తుతం వారం రోజులుగా వరుసగా ముసుర్లు పడుతుండడంతో కడెం ప్రాజెక్ట్‌తోపాటు గ్రామాల్లోని చెరువులు, కుంటలు, బావులు జలకళను సంతరించుకున్నాయి.  

 పొలం పనుల్లో రైతులు బిజీ..
 కడెం ప్రాజెక్టు, సదర్‌మాట్‌లు నిండడంతో అధికారులు ఇదివరకే కాలువల ద్వారా నీటిని వదిలారు. ఈ నీరు పంటలకు కాదు.. చెరువులకు మాత్రమే అని కూడా వారు ప్రకటించారు. కానీ చెరువులు, బావుల కింద మాత్రం రైతులు ఇప్పటికే మండలంలోని చాలా గ్రామాల్లో వరినార్లు పోసుకున్నారు. కష్టపడి వరినార్లను కాపాడిన రైతులకు ఈ వర్షం చాలా ఆదుకున్నట్లయింది. వారంతా ఇపుడు వరినాట్లు వేసుకుంటున్నారు. వారిలో కొత్త ఆశలు చిగురించాయి. తమ పంట సాగు విజయవంతంగా జరుగుతుందన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. మండలంలో ఎక్కడ చూసినా వరినాట్లు వేసుకోవడంలో రైతులు బిజీగా కనిపిస్తున్నారు.   

 15 రోజుల కిందట కురిస్తే..
 వర్షాలున్నట్టుండి ఎటూ కాని సమయంలో కురుస్తుండడంతో కొందరు రైతులు సంతోషంతో ఉండగా మరి కొందరు అయ్యో ఇంకో 15 రోజుల కిందట పడితే తమ వరినారు దక్కేదని బాధ పడుతున్నారు. ఆయకట్టు కింద చాలా మంది రైతుల వరినార్లు ఇప్పటికే ఎండలకు ఎండిపోయాయి. కొందరు తెలిసిన తోటి రైతుల నుంచి, పరిచయం ఉన్న వారి నుంచి డబ్బులకు వరినార్లు కొనుక్కుంటున్నారు. వరినారు దొరకనివారు బాధపడుతున్నారు. ప్రస్తుతం మండలంలో కొద్దిరోజులుగా పంట భూములు రైతులతో కళకళలాడుతున్నాయి.

మరిన్ని వార్తలు