ఫార్మాసిటీై పె అపోహలొద్దు

20 Apr, 2015 23:47 IST|Sakshi

- పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
- ఫార్మాసిటీ, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్ సిటీ భూముల పరిశీలన
కందుకూరు:
ఫార్మాసిటీ ఏర్పాటు పై అపోహలు వద్దని, కాలుష్యరహిత కంపెనీలనే స్థాపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 288లోని ప్రభుత్వం ఫార్మాసిటీకి కేటాయించిన భూములను టీఎస్‌ఐఐసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

భూములకు సంబంధించిన మ్యాప్‌లను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్మాసిటీకి 11 వేల ఎకరాలను సేకరిస్తున్నామని, మొదటి విడతలో మూడు వేల ఎకరాల్లో పనులు ప్రారంభించనున్నామని వెల్లడించారు. అందుకుగాను రహదారుల నిర్మాణం, నీరు, విద్యుత్ వంటి వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. ఎవరికి ఇబ్బంది లేకుండా వంద అడుగుల మేర రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని సూచించారు.

కాలుష్యంలేని కంపెనీలను స్థాపించడానికి సీఎం కేసీఆర్ దీక్షతో పనిచేస్తున్నారని కొనియాడారు. సాగు నీరుతోపాటు పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తొలగించాలన్న సంకల్పంతో పని చేస్తున్నామన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని, గిట్టనివారు చేసే తప్పుడు ప్రచారాలను పట్టించుకోవద్దన్నారు. మున్నుందు ఉజ్వల భవిష్యత్ ఉందని, జాతీయిస్థాయిలో ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. నైపుణ్యంలేని వారికి సైతం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నామన్నారు.

అంతకుముందు మహేశ్వరం మండలంలోని హార్డ్‌వేర్ పార్కు, ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఎన్ని కంపెనీలు ఏర్పాటు జరిగింది.. ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారు.. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. రవాణా సదుపాయాలు, కంపెనీల విస్తరణకు ఆటంకంగా మారిన కోర్టు కేసుల విషయమై టీఎస్‌ఐఐసీ అధికాారులతో చర్చించారు. ఆయన వెంట టీఎస్‌ఐఐసీ ఈడీ ఈవీ.నర్సింహారెడ్డి, జోనల్ మేనేజర్ కె.శ్యాంసుందర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పి. శ్రావణ్‌కుమార్, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ దేవరాజ్, ఉప తహసీల్దార్ వెంకటేష్, స్థానిక సర్పంచ్ గోవర్ధన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు