రెండేళ్లలోనే తుది కేటాయింపులు!

25 Feb, 2018 02:01 IST|Sakshi

దేశంలో నదీ జలాల వివాదాలపై ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌తో పరిష్కారం

మార్చిలోనే పార్లమెంట్‌లోబిల్లు

సాక్షి, హైదరాబాద్‌: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించడం, అవి వెలువరించిన తీర్పులను పక్కాగా అమలు చేసే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేస్తోంది. దేశంలో అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలను విచారించడానికి ఏర్పాటైన వివిధ ట్రిబ్యునళ్లను రద్దు చేసి.. దేశవ్యాప్తంగా ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు మార్చిలో జరుగనున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లోనే.. బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని నిర్ణయించింది. అంతర్రాష్ట్ర జల వివాదాలపై రెండేళ్లలోనే తుది తీర్పు వెలువరించేలా గడువు నిర్దేశించాలన్న పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సులను కూడా బిల్లులో పొందుపరిచింది. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన అనంతరం మూడు నెలల వ్యవధిలోనే పాత ట్రిబ్యునళ్లన్నీ రద్దయి.. దేశవ్యాప్తంగా ఒకే ట్రిబ్యునల్‌ అమల్లోకి రానుంది. ప్రస్తుతం కృష్ణా జలాల వివాదాన్ని చూస్తున్న బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌లో తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితులు లేకపోవడంతో శాశ్వత ట్రిబ్యునల్‌ ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం గట్టిగా సమర్థిస్తోంది. 

ఆ తీర్పే అంతిమం..: దేశవ్యాప్తంగా కృష్ణా, కావేరీ, వంశధార, మహాదాయి, రావి తదితర నదీ జలాల వివాదాలకు సంబంధించి ఎనిమిది ట్రిబ్యునళ్లు పనిచేస్తున్నాయి. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 ప్రకారం.. నదీ జలాల పంపిణీపై ఏదైనా రాష్ట్రంలో తలెత్తిన అభ్యంతరాలను పరిశీలించి కేంద్రం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తుంది. అలా ఏర్పాటు చేసిన కృష్ణా ట్రిబ్యునల్‌ విచారణ పదమూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ వివాదాలకు తగిన పరిష్కారం దొరకలేదు. ప్రస్తుతమున్న అంతర్రాష్ట్ర జల వివాద పరిష్కార చట్టం –1956లోని సెక్షన్‌ 5(2) ప్రకారం.. వివాదంపై నివేదిక అందించడానికి ట్రిబ్యునల్‌కు ప్రాథమికంగా మూడేళ్ల గడువు ఉంది. ఏదైనా కారణంతో తుది నిర్ణయం వెలువరించలేకపోతే గడువును మరో రెండేళ్లు పొడిగించే అధికారం కేంద్రానికి ఉం ది. ఇక ట్రిబ్యునల్‌ నిర్ణయంపై వాద, ప్రతివాదుల్లో ఎవరైనా విభేదిస్తూ సెక్షన్‌ 5 (3) కింద పునఃపరిశీలించాలని కోరితే.. దానిపై తీర్పు చెప్పడానికి మరో ఏడాది సమయం ఉంది. అప్పటికీ తుది నివేదిక ఇవ్వలేకపోతే కేంద్రం గడువు పొడిగించే వీ లుంది. ఇందుకు నిర్దిష్ట కాలపరిమితి లేదు. అంటే గడువును నిరవధికంగా పొడిగించే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో త్వరగా జల వివాదాలను పరిష్కరించే దిశగా ఒకే ట్రిబ్యునల్‌ అంశం తెరపైకి వచ్చింది.

పటిష్టంగా కొత్త ట్రిబ్యునల్‌ 
ఒకే ట్రిబ్యునల్‌ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతమున్న చట్టాలను సవరించి కొత్త చట్టాన్ని తేస్తోంది. దీనిపై ఇప్పటికే బిల్లును కూడా రూపొందించింది. దాని ప్రకారం... 
- ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్‌కు చైర్మన్, వైస్‌ చైర్మన్‌తోపాటు గరిష్టంగా ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరిని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నుంచి నియమిస్తారు. 
- ఈ నియామకాల కోసం నలుగురు సభ్యులతో ప్రత్యేక ప్యానల్‌ లేదా కొలీజియం ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రధానమంత్రి, లేదా ఆయన నియమించిన ప్రతినిధి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియమించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సభ్యులుగా ఉండాలి. 
- సభ్యులను తొలగించే అధికారం కూడా కొలీజియానికి ఉండాలి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్‌పర్సన్‌గా ఉండనున్నారు. 
- కొత్త ట్రిబ్యునల్‌ రెండేళ్లలో తన తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. 
- వివాదాలను పొడిగించడానికి వీలులేకుండా ‘ట్రిబ్యునల్‌ ఇచ్చే తీర్పే అంతిమం’అని చెబుతూ బిల్లులో కొత్తగా 6వ సెక్షన్‌ను కూడా చేర్చారు. 
- ఈ ట్రిబ్యునల్‌ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సమానం కాబట్టి అన్ని రాష్ట్రాలూ కట్టుబడి ఉండాల్సిందే.   

మరిన్ని వార్తలు