తుదిదశకు ప్రధాని సభ ఏర్పాట్లు

5 Aug, 2016 03:15 IST|Sakshi
తుదిదశకు ప్రధాని సభ ఏర్పాట్లు

మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణ
* బస్సులు, జనం తరలింపుపై జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష
* రంగంలోకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్
* సభాస్థలి, హెడ్ రెగ్యులేటర్, హెలిపాడ్‌ల వద్ద తనిఖీలు

గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ఈ నెల 7న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆ రోజు కోమటిబండ గుట్టపై ప్రధాని ‘మిషన్  భగీరథ’ను ప్రారంభించనున్న విషయం విదితమే. పైలాన్  పనులు తుది దశకు చేరుకున్నాయి. పైలాన్  చుట్టూ గార్డెనింగ్ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు.

పక్కనే నల్లాను బిగించనున్నారు. గుట్ట కింది భాగంలో నిర్వహించే బహిరంగ సభకు వేదిక ముస్తాబవుతోంది. జర్మన్  టెక్నాలజీతో రెరుున్  ప్రూఫ్ టెంట్లను వేస్తున్నారు. భారీ వర్షం వచ్చినా సభలో పాల్గొనే 2 లక్షల మందికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరందరికీ కుర్చీలతోపాటు ప్రధాని ప్రసంగాన్ని దగ్గరగా వీక్షించేందుకు 50కిపైగా ఎల్‌ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నారు. సభకు 3 వేలకు పైగా ఆర్టీసీ, 1500కు పైగా ప్రైవేటు బస్సులను వినియోగిస్తున్నారు. వీరికి బస్సులో కూర్చున్న వెంటనే పులిహోర లేదా పెరుగన్నంతో పాటు రెండు అరటిపండ్లు, వాటర్‌బాటిల్ అంది స్తారు. 12 గంటలకల్లా వేదిక వద్దకు వీరంతా చేరుకోవాల్సి ఉంటుంది. సభాస్థలిలో 250 సాధారణ, 100 మొబైల్ టాయ్‌లెట్లు ఏర్పాటు చేస్తున్నారు.
 
రంగంలోకి ఎస్పీజీ
ప్రధాని సభ నేపథ్యంలో ఎస్పీజీ రంగంలోకి దిగింది. గురువారం కోమటిబండకు ఎస్పీజీ డీఐజీ నంబియార్ ఆధ్వర్యంలో వచ్చిన బృందం సభాస్థలి, గుట్టపై ఉన్న హెడ్ రెగ్యులేటర్, హెలిపాడ్, సభాస్థలి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం, రోడ్లు వద్ద తనిఖీలు చేపట్టారుు. అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా జవాన్లు తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రధాని హెలిపాడ్ వద్ద డాగ్‌స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అనుమానం వచ్చిన చోట తవ్వించి మరమ్మతు చేయిస్తున్నారు. కోమటిబండ నుంచి గుట్టపైకి వెళ్లే మార్గం, సభాస్థలితో పాటు ప్రధాని వచ్చే హెలిపాడ్ స్థలం వరకు రోడ్డుకు ఇరువైపులా ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. 4 కిలోమీటర్ల మేర ఇనుప కంచె ఉంది. ఈ మార్గం పొడవునా 32 సీసీ కెమెరాలను బిగిస్తున్నారు.
 
పనులను పర్యవేక్షించిన హరీశ్
కోమటిబండలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. గురువారం సాయంత్రం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఇతర ఉన్నతాధికారులతో కలసి ఏర్పాట్లపై ఆరా తీశారు. సభకు వివిధ నియోజకవర్గాల నుంచి తరలించే బస్సులు, జనాల సంఖ్యపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. ప్రధాని కార్యక్రమ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. ఎస్పీజీ బృందం సైతం ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు