20 నుంచి ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు 

30 May, 2020 04:44 IST|Sakshi

ఆయా విద్యార్థుల బ్యాక్‌లాగ్‌ పరీక్షల నిర్వహణ అప్పట్నుంచే..

నవంబర్‌ లేదా డిసెంబర్‌లో మిగతా సెమిస్టర్ల రెగ్యులర్‌ పరీక్షలు

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: యూజీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు, ఆయా విద్యార్థుల బ్యాక్‌లాగ్‌ పరీక్షలను వచ్చే నెల 20 నుంచి నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. మిగతా సెమిస్టర్ల పరీక్షలను కాలేజీలు ప్రారం భమయ్యాక నవంబర్‌/ డిసెంబర్‌లో నిర్వహిం చుకోవాలని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను యూనివర్సిటీలకు జారీ చేసినట్లు తెలిపారు.  అవసరమైతే వర్సిటీలు వాటిని తమ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్స్, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌లో ఆమోదం తీసుకొని అమలు చేయాలని వెల్లడించారు. మార్గదర్శకాలివే..
► పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించాలి. అందుకు అనుగుణంగా ప్రశ్న పత్రాన్ని మార్పు చేయాలి. వీటి రూపకల్పన ఆయా యూనివర్సిటీలే చేసుకోవాలి.
► బ్యాక్‌లాగ్‌లతో సహా అన్ని యూజీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు జూన్‌ 20వ తేదీ నుంచి నిర్వహించుకోవాలి. మిగతా సెమిస్టర్ల పరీక్షలను కాలేజీలు తెరిచాక నవంబర్, డిసెంబర్‌లో ఒక సెమిస్టర్‌ తర్వాత మరో సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించాలి. బ్యాక్‌లాగ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా మిగతా సెమిస్టర్ల విద్యార్థులను పై సెమిస్టర్‌కు ప్రమోట్‌ చేయాలి.
► సంప్రదాయ డిగ్రీల విషయంలో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించాలి. ఒక సెషన్‌లో బీకాం విద్యార్థుల్లో సగం మందికి పరీక్షలు నిర్వహిస్తే, ఇతర కోర్సుల (బీఏ, బీఎస్సీ) సగం మందికి పరీక్షలు నిర్వహించాలి. మరొక సెషన్‌లో ఆయా కోర్సుల్లో మిగిలిన సగం మందికి పరీక్షలు నిర్వహించాలి. ఈ కోర్సుల ప్రాక్టికల్స్‌ నిర్వహణను సంబంధిత కాలేజీలకు వదిలేయాలి. ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్‌ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్లను సంబంధిత ప్రిన్సిపాళ్లే నియమించుకుంటారు. 
► ప్రాజెక్టులు, వైవా, సెమినార్స్‌ వంటికి ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలి. పీహెచ్‌డీ విద్యార్థులకు సంబంధించి సెమినార్లు, వైవా విషయంలో యూజీసీ నిబంధనలను అమలు చేయాలి. ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలి.

>
మరిన్ని వార్తలు