ఓటర్ల తుది జాబితా విడుదల

5 Jan, 2020 07:17 IST|Sakshi
జవహర్‌నగర్‌లో తుది ఓటరు జాబితాను విడుదల చేస్తున్న అధికారులు

మేడ్చల్,రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం ఓటర్లు 12.30 లక్షలు  

రంగారెడ్డి జిల్లాలోని 15 పురపాలికల్లో 6,40,366 మంది

మేడ్చల్‌ జిల్లా 13 మున్సిపాలిటీల్లో 5,90,493 మంది

సాక్షి, మేడ్చల్‌జిల్లా: మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం అధికారులు తుది ఓటర్ల జాబితాను కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారిగా వెల్లడించారు. డిసెంబర్‌ 30న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా కలెక్టరేట్లతో(జిల్లా కేంద్రాల్లో) పాటు మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించి..జాబితాలో చేర్పులు, మార్పులు, తప్పొప్పులపై చర్చించారు. అలాగే, ఓటర్ల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన అనంతరం ఆయా మార్పులతో శనివారం అధికారికంగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు.

కార్పొరేషన్లు,  మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర ఓటర్లు ఎంతమందో ఫైనల్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 8వ తేదీ నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించే అవకాశముంది. కాగా, శనివారం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీల్లో 115 డివిజన్లు, 189 వార్డులు ఉన్నాయి.

ఈ జిల్లాలో మొత్తం 5,90,493 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 3,07,895 మంది, మహిళలు 2,82,541 మంది, ఇతరులు 57 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లో 100 డివిజన్లు, 151 వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,40,366 ఉండగా, వీరిలో 3,29,261 మంది పురుషులు, 3,11,037 మంది మహిళలు, 68 మంది ఇతరులు ఉన్నారు.    

మరిన్ని వార్తలు