స్థానిక సంస్థలకు నిధులొస్తున్నాయ్‌..!

27 Feb, 2020 01:53 IST|Sakshi

గ్రామపంచాయతీలతో పాటు జెడ్పీలు, ఎంపీపీలకు మూడంచెల్లో నిధులు

ఎంపీపీలకు 10%, జెడ్పీలకు 5% ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు

రాష్ట్రాలకు తలసరి గ్రాంటు కేటాయింపులకు కేంద్రం ఆమోదం

1,847 కోట్లు కేటాయింపు గతేడాది కంటే రూ.396 కోట్లు అదనం

దీనికి సమానంగా మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ స్థానిక సంస్థలకు శుభవార్త. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న మండల, జిల్లా పరిషత్‌లకు ఈ ఏడాది నుంచి మనుగడలోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మేర వాటా దక్కనుంది. 2015–20 వరకు అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీలకే నేరుగా నిధులు బదలాయించేది. వాస్తవానికి 13వ ఆర్థిక సంఘం వరకు మూడంచెల వ్యవస్థలకు పంచాయతీ, మండల, జెడ్పీలకు నిర్దేశిత నిష్పత్తిలో నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి రాగానే ఈ విధానానికి మంగళం పాడింది. ఆర్థిక సంఘం నిధుల నుంచి మండల, జిల్లా పరిషత్‌లకు కోత విధించి.. 100 శాతం నిధులను పంచాయతీలకే బదలాయించింది.  

మధ్యంతర నివేదిక ఆధారంగా.. 
15వ ఆర్థిక సంఘం ఇటీవల కేంద్రానికి మధ్యంతర నివేదిక అందజేసింది. ఈ సిఫార్సులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.60,750 కోట్లు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు రూ.1,847కోట్లు కేటాయించింది. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్‌ గ్రాంట్‌ సర్దుబాటు చేయనుంది. ఆర్థిక సంఘం నిధులకు సమానం గా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను ఇస్తుందని సీఎం కేసీఆర్‌ ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరో రూ.1,847 కోట్లను రాష్ట్రం సర్దుబాటు చేస్తుం దని పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెలా రూ.339 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తోంది. 

గతేడాది కంటే ఎక్కువే...
వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం గతేడాది కన్నా రూ.396 కోట్లు అధికంగా ఇవ్వనుంది. రూ.1874 కోట్లను రెండు విభాగాలుగా ఖర్చు పెట్టాలని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జాయింట్‌ సెక్రటరీ సంజీవ్‌ పత్‌జోషి.. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఇటీవల రాసిన లేఖలో సూచించారు. గ్రామీణ స్థానిక సంస్థల్లోని తక్షణ అవసరాలకు ఖర్చు చేసేందుకు ఇందులో సగం నిధులను ఉపయోగించుకోవచ్చని, అయితే సిబ్బంది జీతభత్యాలకు మాత్రం ఈ నిధులు వెచ్చించొద్దని స్పష్టం చేశారు.

మిగిలిన సగం నిధులు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, వాననీటి సంరక్షణ లాంటి పనుల కోసం ఉపయోగించాలని వెల్లడించారు. ఇక, గ్రామపంచాయతీలు, మండలపరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల వారీగా పరిశీలిస్తే మొత్తం నిధుల్లో కనిష్టంగా 70 శాతం, గరిష్టంగా 85 శాతం నిధులు గ్రామ పంచాయతీలకే కేటాయిస్తారు. మండల పరిషత్‌లకు అదే తరహాలో 10–25 శాతం, జిల్లా పరిషత్‌లకు 5–15 శాతం నిధులివ్వనున్నారు.  

నిధుల్లేక.. నీరసపడి 
వాస్తవానికి, గతంలో గ్రామపంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు కూడా తలసరి గ్రాంటు కేటాయింపులు ఉండేవి. అయితే, 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి తలసరి నిధులను నేరుగా గ్రామపంచాయతీలకే కేటాయించారు. దీంతో సీనరేజ్‌ సెస్, స్టాంపు డ్యూటీ వాటా, అరకొర సాధారణ నిధులు తప్ప జిల్లా, మండల పరిషత్‌లకు నిధుల్లేక నీరసపడ్డాయి. కనీసం సిబ్బంది జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోకి కొన్ని జిల్లా పరిషత్‌లు వెళ్లిపోయాయి. ఇప్పుడు కేంద్రం నేరుగా గ్రామాలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు మంజూరు చేయనుండటంతో ఈ ఏడాది జూన్‌ నుంచి మళ్లీ ఆ రెండు వ్యవస్థలు కళకళలాడనున్నాయి.   

మరిన్ని వార్తలు